మంగళవారం 19 జనవరి 2021
Crime - Dec 22, 2020 , 09:01:17

ప్రాణం తీసిన జొన్నరొట్టెలు..సంగారెడ్డిలో విషాదం

ప్రాణం తీసిన జొన్నరొట్టెలు..సంగారెడ్డిలో విషాదం

హైదరాబాద్‌ : జొన్న రొట్టెలు ముగ్గురి ప్రాణాలను బలిగొన్నాయి.. కులవృత్తి చేసుకుంటూ పొట్టపోసుకుంటున్న ఓ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. కొద్ది రోజుల కిందట తృటిలో తప్పిన ప్రమాదం.. మళ్లీ వెంటాడింది. ఈ విషాదకర ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. వట్‌పల్లి మండలం పల్వట్ల గ్రామానికి చెందిన జంగం చంద్రమౌళి కుటుంబం కులవృత్తిని నిర్వహిస్తూ జీవనం కొనసాగిస్తోంది. రోజులాగే సోమవారం రాత్రి భోజనాలు చేసి నిద్రకు ఉపక్రమిస్తుండగా చంద్రమౌళి(60), సుశీల(55), అనసూజ, శ్రీశైలం, సరిత ఒక్కసారిగా వాంతులు, విరేచనాలు చేసుకుని తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వీరిని జోగిపేటకు తరలించారు.

పరిస్థితి విషమించడంతో చంద్రమౌళి, సుశీల, శ్రీశైలం మృతి చెందారు. మిగతా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌కు తరలించారు. ఇటీవల కిందట ఇదే తరహాలో చంద్రమౌళి తల్లి పెద్ద శంకరమ్మ (70) మృతి చెందింది. కులవృత్తిలో భాగంగా పలువురి ఇండ్ల నుంచి పిండి, బియ్యం, ఇతర వస్తువులు తెచ్చేది. ఈ క్రమంలో ఎవరి దగ్గరో జొన్నపిండి తీసుకువచ్చిందని, ఆమె కూడా జొన్నరొట్టెలు తిన్న తర్వాతే అస్వస్థకు గురైందని స్థానికులు చెప్పారు. అదే మిగతా కుటుంబీకులెవరూ తినకపోవడంతో ప్రాణాల నుంచి బయటపడ్డారు. మళ్లీ సోమవారం రాత్రి అదే జొన్నపిండితో చేసిన రొట్టెలు తిన్న వెంటనే అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది.

ఐదుగురు కుటుంబ సభ్యులు జొన్నపిండితో చేసిన రొట్టెలు తినడంతో ముగ్గురు మృతి చెందగా.. మరో ఇద్దరు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. పక్షం రోజుల్లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృత్యువాతపడడంతో గ్రామంలో విషాదం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. అయితే జొన్నపిండి ఎక్కడి నుంచి వచ్చింది..? ఎవరు ఇచ్చారు? అనే కోణంలో విచారణ జరుపుతున్నారు.