న్యూఢిల్లీ : మైనర్ బాలికపై ముగ్గురు వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడి నేరాన్ని వీడియోలో చిత్రీకరించిన ఘటన యూపీలోని ఘజియాబాద్‌లో వెలుగుచూసింది. ఈ ఉదంతంలో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల్లో ఒకరిని పదిహేనేండ్ల బాధిత బాలిక ఇంటి పక్కనే ఆటోమొబైల్ రిపేర్ షాప్ నిర్వహించే సమీర్‌గా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..కొద్దినెలలుగా బాలికతో పరిచయం పెంచుకున్న నిందితుడు ఈనెల 11న ఆమెను తన షాపుకు పిలిపించి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనను అక్కడే ఉన్న నిందితుడి బంధువు కెమెరాలో రికార్డు చేశాడు.
ఆపై నిందితుడి బంధువు ఆమెపై దారుణానికి ఒడిగట్టాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే వీడియోను బహిర్గతం చేస్తామని వారు బాలికను బెదిరించారు. ఈనెల 21న వీడియోను డిలీట్ చేస్తామని మరోసారి షాపునకు బాలికను రప్పించి మళ్లీ లైంగిక దాడికి పాల్పడ్డారు. వారి స్నేహితుడు షోయబ్ కూడా ఈ నేరంలో పాలుపంచుకున్నాడు. ఇక రెండురోజుల తర్వాత బాలిక జరిగిన విషయం కుటుంబ సభ్యులకు తెలపడంతో ముగ్గురు నిందితులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలి తండ్రి అదే ప్రాంతంలో దాబా నిర్వహిస్తున్నారు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు వారిని జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు. నేరాన్ని రికార్డు చేసిన మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.