బుధవారం 15 జూలై 2020
Crime - Jun 04, 2020 , 20:01:00

ఐదు నెలల్లో వేయి సైబర్‌ కేసులు

ఐదు నెలల్లో వేయి సైబర్‌ కేసులు

హైదరాబాద్‌: పోలీసులు ఎంత చెప్తున్నా నిత్యం ఎక్కడో ఒక ప్రాంతంలో ఎవరో ఒకరు సైబర్‌ మోసగాళ్ల వలకు చిక్కుతున్నారు. గుర్తుతెలియని వ్యక్తుల ఫోన్‌ కాల్స్‌ రిసీవ్‌ చేసుకోవద్దని, వారు అడుగుతున్న బ్యాంకు ఖాతా వివరాలు చెప్పొద్దంటూ పోలీసులు నెత్తీనోరు బాదుకొంటున్నా.. చదువుకొన్నవారు సైతం వారికి బలవుతున్నారు. హైదరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ ఠాణాలో ఐదు నెలల కాలంలో వేయి కేసులు నమోదయ్యాయి. లాక్‌డౌన్‌ నేపథ్యంలో కొద్దిమేర తగ్గుముఖం పట్టిన కేసులు.. సడలింపులతో తిరిగి పెరిగాయి. 

నగర పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో సైబర్‌నేరాల సంఖ్య ఎప్పటికప్పుడు పెరుగుతున్నాయి. సైబర్‌ నేరగాళ్లు కొత్త కొత్త ఎత్తులతో అమాయకులపై వల విసురుతూ నిండా ముంచుతున్నారు. ఉత్తరాది రాష్ర్టాలకు చెందిన వారే ఎక్కువగా సైబర్‌ మోసాలకు పాల్పడుతున్నారు.  సైబర్‌ నేరగాళ్లను పట్టుకొనేందుకు హైదరాబాద్‌ సైబర్‌క్రైం పోలీసులు నెలలో కనీసం 15 రోజులపాటు జార్ఖండ్‌, బీహార్‌, పశ్చిమబెంగాల్‌, రాజస్థాన్‌, ఢిల్లీ తదితర ప్రాంతాల్లో మకాం వేస్తూ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. పోలీసులకు దొరకకుండా అప్రమత్తంగా ఉంటున్న ఈ మోసగాళ్లు.. సిమ్‌కార్డు, బ్యాంకు ఖాతాలు వారి రాష్ర్టాల్లోనే కాకుండా పక్క రాష్ర్టాల్లోని మారుమూల ప్రాంతాల అమాయకుల నుంచి కమిషన్‌ పద్ధతిలో సిమ్‌కార్డులు, బ్యాంకు ఖాతాలతో నేరాలు చేస్తుండటంతో.. కొన్నిసార్లు ప్రధాన నిందితుడి వద్దకు పోలేని పరిస్థితిలో పోలీసులు ఉంటున్నారు. ఒక పక్క నేరస్థులను పట్టుకోవడం.. మరో పక్క ప్రజల్లో అవగాహన తేవడం కోసం పోలీసులు నిరంతరం ప్రయత్నిస్తున్నారు. 

హైదరాబాద్‌ నగర సైబర్‌క్రైం ఠాణాకు వివిధ సైబర్‌నేరాలకు సంబంధించిన బాధితులు ఫిర్యాదులు ఇచ్చేందుకు వస్తుంటారు. ఇందులో కొందరు ఆర్ధికంగా నష్టం లేకపోయినా, తన ఈ-మెయిల్‌ హ్యాక్‌  చేశారని, తనను మోసం చేసేందుకు ప్రయత్నం చేశారనే విషయాన్ని గుర్తించి, ముందు జాగ్రత్తగా ఫిర్యాదు చేస్తారు. సోషల్‌మీడియాలో వేధింపులకు గురయ్యేవారు, హ్యాకింగ్‌, నకిలీలు ఇలా వివిధ ఫిర్యాదులు వస్తుంటాయి. ఇందులో ఆర్ధికపరమైన కేసుల్లో ఓటీపీలు,  ఓఎల్‌ఎక్స్‌, మ్యాట్రీమోని, లాటరీ, ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నమ్మిస్తూ చేసే మోసాలు ఉంటున్నాయి. ఇలా కేవలం ఐదు నెలల కాలంలో మూడు వేల మంది సైబర్‌ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు తీవ్రత ఆధారంగా ఈ సమయంలో వేయి ఎఫ్‌ఐఆర్‌లను పోలీసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది. 


logo