మంగళవారం 19 జనవరి 2021
Crime - Nov 11, 2020 , 19:25:54

దొంగ అరెస్టు.. భారీగా ఆభ‌ర‌ణాలు స్వాధీనం

దొంగ అరెస్టు.. భారీగా ఆభ‌ర‌ణాలు స్వాధీనం

న‌ల్ల‌గొండ : పాత అల‌వాట్లు అంత తొంద‌ర‌గా వ‌దిలిపోవంటారు. న‌ల్ల‌గొండ జిల్లా కేంద్రంలో ప‌ట్టుబ‌డిన మాజీ ఖైదీ వ్య‌వ‌హారం కూడా ఈ కోవ‌కే చెందింది. జిల్లా జైలు శాఖ ఆధ్వ‌ర్యంలో న‌ల్ల‌గొండ‌లో ఫుడ్ కోర్టు న‌డుస్తుంది. స్థానిక ఒంటిస్తంభం బ‌జార్‌కు చెందిన వంగాల సైదులు(27) గ‌తంలో ప‌లు నేరాల‌కు పాల్ప‌డి జైలుకు వెళ్లాడు. బెయిల్‌పై కొన్ని నెల‌ల క్రిత‌మే విడుద‌ల‌య్యాడు. కాగా పున‌రావాస కార్య‌క్ర‌మంలో భాగంగా అధికారులు ఈ మాజీ ఖైదీకి ఫుడ్ కోర్డులో ప‌ని క‌ల్పించారు. ఒక‌వైపు ప‌నిచేస్తూనే మ‌రోవైపు పోలీసుల కండ్లు క‌ప్పి జిల్లాలోని ప‌లు ప్రాంతాల్లో సైదులు చోరీల‌కు పాల్ప‌డ్డాడు. వ‌రుస దొంగ‌త‌నాల నేప‌థ్యంలో పోలీసులు అనుమానంతో సైదులును అదుపులోకి తీసుకుని విచారించారు.

విచార‌ణ‌లో సైదులు దొంగ‌త‌నాల‌కు పాల్ప‌డిన‌ట్లుగా ఒప్పుకున్నాడు. శాలీగౌరారం, న‌కిరేక‌ల్‌, మునుగోడు, చందంపేట‌లో చోరీల‌కు పాల్ప‌డిన‌ట్లుగా చెప్పాడు. నిందితుడిని న‌ల్ల‌గొండ వ‌న్ టౌన్ స‌ర్కిల్ ఇన్‌స్పెక్ట‌ర్ ఎన్‌.సురేష్ మీడియా ఎదుట ప్ర‌వేశ పెట్టారు. నిందితుడి వ‌ద్ద నుంచి 32 తులాల బంగారు ఆభ‌ర‌ణాలు, 55 తులాల వెండి ఆభ‌ర‌ణాల‌ను స్వాధీనం చేసుకున్న‌ట్లు చెప్పారు. ప‌ట్టుబ‌డ్డ సొత్తు విలువ రూ. 17 ల‌క్ష‌లుగా స‌మాచారం.