శుక్రవారం 10 జూలై 2020
Crime - Feb 14, 2020 , 06:50:08

కుమారుడి స్నేహితుడినంటూ వచ్చి...

కుమారుడి స్నేహితుడినంటూ వచ్చి...

హైదరాబాద్ : కుమారుడి స్నేహితుడినంటూ ఇంటికి వచ్చిన ఓ యువకుడిని నమ్మి ఆశ్రయం కల్పిస్తే ఇంట్లో చోరీకి పాల్పడిన సంఘటన నగరలోని ఎస్సార్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. డీఐ వై.ఆజయ్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం... మోతీనగర్‌, కల్యాణ్‌నగర్‌ ఫేస్‌-3లోని మానస అపార్ట్‌మెంట్‌లో డి.సుమతి(52) అనే మహిళ నివాసం ఉంటుంది. ఆమె కుమారుడు శ్రీనివాస్‌ గుంటూరులో కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 11వ తేదీన రాత్రి 10 గంటల ప్రాంతంలో మిర్యాలగూడ సమీపంలోని అవంతిపురంకు చెందిన మనోజ్‌ అనే యువకుడు ఇంట్లో ఒంటరిగా ఉన్న డి.సుమతి ఇంటికి వచ్చాడు. తాను శ్రీనివాస్‌ స్నేహితుడిని అని చెప్పాడు. చాలా దూరం నుంచి వచ్చానని, రాత్రి ఆశ్రయం కల్పించాలని ఉదయాన్నే వెళ్లిపోతానని కోరాడు. చీరెల వ్యాపారం చేసే సుమతి వద్దకు గతంలో కూడా మనోజ్‌ వచ్చి పోయేవాడు. అయినప్పటికీ తమ కుమారుడికి విషయం చెప్పేందుకు ఫోన్‌ చేస్తే స్విచ్ఛాఫ్‌ అని రావడంతో చేసేది లేక రాత్రి ఉండేందుకు సుమతి అంగీకరించారు. దీంతో రాత్రి ఇంట్లోనే నిద్రించినట్లు నటించిన మనోజ్‌ అల్మారా తాళాలు తీసుకుని అందులో ఉన్న (4.5 గ్రాముల నెక్లెస్‌, 3 తులాల ఏడు ఉంగరాలు, చెవి రింగులు, మాటీలు కలిపి తులం పైన) మొత్తం సూమారు 8.5 తులాల బంగారు ఆభరణాలు, రూ.10 వేల నగదుతో ఇంటి నుంచి ఉడాయించాడు. దీంతో ఉదయాన్నే అల్మారా తెరిచి చూసుకున్న బాధితురాలు సుమతి చోరీ జరిగినట్లు గుర్తించి ఎస్సార్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు డీఐ తెలిపారు. 


logo