సోమవారం 21 సెప్టెంబర్ 2020
Crime - Jun 30, 2020 , 18:46:50

దారి దోపిడీ ముఠాను అరెస్టు చేసిన పోలీసులు

దారి దోపిడీ ముఠాను అరెస్టు చేసిన పోలీసులు

భద్రాద్రి కొత్తగూడెం : జల్సాలకు అలవాటు పడి దారి దోపీడీలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. జిల్లాలోని లక్ష్మీదేవిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని రేగళ్ల అటవీ ప్రాంతంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సీఐ అశోక్, ఎస్ఐ ప్రవీణ్ కుమార్, సిబ్బందికి అనుమానాస్పదంగా కనిపించిన ఆరుగురు యువకులను అదుపులోకి తీసుకొని విచారించారు. కూలి పనులు చేసుకుంటూ జీవనం గడిపే ఈ ఆరుగురు యువకులకు జల్సాలు చేయటానికి డబ్బులు సరిపోక రేగళ్ల అటవీ ప్రాంతంలో ఒంటరిగా ప్రయాణించే ప్రేమికులను, ఆడ వారిని టార్గెట్ చేస్తూ కత్తులతో బెదిరించి వారి వద్ద నుంచి నగదు, ఆభరణాలను దోచుకుంటున్నట్లు విచారణలో  తేలిందని సీఐ అశోక్ వెల్లడించారు. 

రేగళ్ల అటవీ ప్రాంతంలో ప్రతిరోజు సాయంత్రం ప్రయాణం చేసే ప్రేమికులను ఫొటోలు,  వీడియోలు తీసి వారిని కత్తులతో బెదిరించి వారివద్ద ఉన్న వస్తువులను, నగదును కాజేస్తూ జల్సాలకు పాలడుతున్నారని తెలిపారు. గతంలో వీరిపై లక్ష్మీదేవిపల్లి పోలీస్ స్టేషన్లో రెండు దోపిడీ కేసులు, ఒక దొంగతనం కేసు, చుంచుపల్లి పోలీస్ స్టేషన్లో ఒక దొంగతనం కేసు నమోదైనట్లు పేర్కొన్నారు. పట్టుబడిన వీరి వద్ద నుంచి సుమారుగా 10 తులాల బంగారం, రెండు బైకులు, రెండు కత్తులు, 3000/- రూపాయల నగదును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించామన్నారు.


తాజావార్తలు


logo