శనివారం 28 నవంబర్ 2020
Crime - Oct 24, 2020 , 11:24:22

అధికారుల తప్పిదం.. విద్యార్థిని నిండు ప్రాణం బలి

అధికారుల తప్పిదం.. విద్యార్థిని నిండు ప్రాణం బలి

భోపాల్‌ : అధికారుల తప్పిదంతో ఎంతో ఉజ్వల భవిష్యత్‌ ఉన్న విద్యార్థిని ప్రాణాలు తీసుకుంది. ఇటీవల ప్రకటించిన నేషనల్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ కం ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (నీట్‌)లో తాను కేవలం ఆరు మార్కులు రావడంతో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. వెరిఫికేషన్‌లో 590 మార్కులు వచ్చాయని తల్లిదండ్రులు చెప్పి ఉత్సాహపరిచేందుకు ప్రయత్నించినా మనస్తాపంతో ప్రాణాలు తీసుకుంది.

ఈ విషాదకర ఘటన మధ్యప్రదేశ్‌లోని చింద్వారా జిల్లాలో చోటు చేసుకుంది. చింద్వారాకు చెందిన విధి సూర్యవంశిని (18) వైద్య విద్య కోసం నీట్‌ పరీక్ష రాసింది. ఇటీవల విడుదల చేసిన ఫలితాల్లో ఆమెకు ఆరు మార్కులు రాగా, యువతి తీవ్ర నిరాశకు లోనైంది. దీంతో తల్లిదండ్రులు మరోసారి అధికారుల దృష్టికి తీసుకెళ్లి రీ వెరిఫికేషన్‌ చేయించారు. అధికారుల పొరపాటో.. సాంకేతిక లోపమో.. తెలియదు కానీ సదరు యువతి 590 మార్కులు సాధించినట్లు తేలింది.

ఈ విషయాన్ని తల్లిదండ్రులు సూర్యవంశినికి చెప్పి ఉత్సాహపరిచారు. వైద్య వృత్తిలో రాణించాలని ఎన్నో కలలతో చదివి, పరీక్ష రాసిన యువతి తల్లిదండ్రులు అబద్ధం చెప్పి ఉంటారని భావించి ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ప్రాథమిక విచారణలో నీట్‌లో తక్కువ మార్కులు రావడమే ఆత్మహత్యకు కారణమని తేలిందని, దర్యాప్తు కొనసాగిస్తున్నామని పరాసియా పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జి సుమెర్ సింగ్ జగ్తే చెప్పారు.

అయితే ఈ ఘటనపై కాంగ్రెస్‌ ఎంపీ నకుల్‌నాథ్‌ సోషల్‌ మీడియా వేదికపై పోస్ట్‌ చేశారు. ‘జాతీయ పరీక్షల ఇలాంటి తీవ్రమైన తప్పు ఎలా జరిగింది. దాని ఫలితంగా విద్యార్థిని ప్రాణం తీసుకుందని, తప్పుకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని’ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.