ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Crime - Aug 25, 2020 , 19:46:08

భార్య వేధింపులు తాళలేక.. సుపారి ఇచ్చి మరీ హత్య చేయించిన భర్త

భార్య వేధింపులు తాళలేక.. సుపారి ఇచ్చి మరీ హత్య చేయించిన భర్త

సుపాల్‌ : భార్య వేధింపులు తాళలేక ఓ భర్త సుపారి ఇచ్చి మరీ హత్య చేయించాడు. ఈ ఘటన బీహార్‌ రాష్ర్టం సుపాల్‌ జిల్లాలో ఆగస్టు 19న జరగ్గా కేసుకు సంబంధించి నిందితులను పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. 

వివరాలు.. సుపాల్‌ జిల్లా త్రివేణి గంజ్‌ ఫెయిర్ మైదానంలో నివాసం ఉండే వ్యాపారవేత్త సురేశ్‌ చౌదరికి తన భార్యతో 2005లో వివాహం అయ్యింది. వీరికి 11 ఏండ్ల కుమారుడు, 9 ఏండ్ల కుమార్తె ఉన్నారు. ఇదిలా ఉండగా గత 4 ఏండ్ల నుంచి భార్యభర్తలిద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. భార్యతో విసిగి వేసారిన సురేశ్‌ ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని ప్లాన్‌ చేశాడు. 

తన భార్యను హత్య చేసేందుకు గాను బీహార్‌కు చెందిన ఇగ్న్యూష్ పాల్, అల్స్ అనే ఇద్దరు ప్రొఫెషనల్‌ కిల్లర్స్‌కు రూ.50వేలు సుపారి ఇచ్చాడు. దీంతో ఆగస్టు 19న తెల్లవారుజాము 4 గంటలకు ఇంట్లో నిద్రిస్తున్న సురేశ్‌ భార్యను దుండగులు లోపలికి ప్రవేశించి గన్‌తో కాల్చి హత్య చేశారు. ఈ విషయమై సురేశ్‌ ఏడుపు నటిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

కేసు నమోదు చేసుకున్న త్రివేణి గంజ్‌ పోలీసులు దర్యాప్తు ప్రారంభించి క్లూ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో మహిళ భర్త సురేశ్‌ ఎవరో ఇద్దరు వ్యక్తులతో మాట్లాడుతున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు కాగా.. వాటిని పరిశీలించిన పోలీసులు సురేశ్‌ను విచారించగా భార్య వేధింపులు తాళలేక హత్య చేయించినట్లు ఒప్పుకున్నాడు. అతడిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి మిగిలిన ఇద్దరు హంతకుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్లు  ఎస్పీ రాజేశ్‌కుమార్‌ మంగళవారం తెలిపారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo