సోమవారం 21 సెప్టెంబర్ 2020
Crime - Jul 20, 2020 , 12:21:30

పదో తరగతి విద్యార్థినిపై లైంగికదాడి.. హత్య!

పదో తరగతి విద్యార్థినిపై లైంగికదాడి.. హత్య!

దినజ్‌పూర్‌ :  పశ్చిమ బెంగాల్‌ రాష్ర్టం ఉత్తర దినజ్‌పూర్ జిల్లాలోని చోప్రా నియోజకవర్గంలో ఓ 15 ఏండ్ల పాఠశాల బాలికపై ఆదివారం రాత్రి లైంగికదాడి చేసి హత్య చేశారు. బాలికను కిడ్నాప్‌ చేసి అనంతరం లైంగికదాడికి పాల్పడి హత్య చేసినట్లు కుటుంబ సభ్యులు, పోలీసులు గుర్తించారు. ఈ ఘటన అనంతరం స్థానికులు జాతీయ రహదారిపై రాస్తారోకో చేసి నిందితులను కఠినంగా శిక్షించాలని నిరసన చేపట్టారు. పోలీసులు ఎంత చెప్పినా వినకపోవడంతో లాఠీచార్జి చేసి నిరసనకారులను చెదరగొట్టారు. 

దుండగులు విద్యార్థినిపై లైంగికదాడి జరిపి హత్య చేసి మృతదేహాన్ని సోనార్పూర్ ప్రాంతంలోని మర్రి చెట్టు దగ్గర పడేశారు. మరణించిన విద్యార్థిని ఇటీవల పదోతరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించినట్లు ఆమె కుటుంబ సభ్యులు తెలియజేశారు. నిన్న రాత్రి బాలిక అదృశ్యమైన తరువాత, కుటుంబ సభ్యులు ఆమెను వెతకడం ప్రారంభించగా చెట్టు కింద బాలిక మృతదేహం కనబడిందని వారు పేర్కొన్నారు. విషం పోసి చంపిన విధంగా నోట్లో నుంచి నురుగలు వస్తున్నట్లు గమనించామని వారు తెలిపారు. బంధువులు, ఇతర వర్గాలకు చెందిన ఐదుగురిపై అనుమానం వ్యక్తం చేస్తున్నామని వారు పోలీసులకు తెలియజేశారు. ఈ విషయమై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. దస్పారా గ్రామసభ కమిటీ సభ్యుడు అసీమ్ బర్మన్ మాట్లాడుతూ పోలీసులు రెండు సైకిళ్లు, ఆధార్ కార్డు, ఒక ఫోన్‌ను ఘటనా స్థలం నుంచి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. 

ఈ సంఘటనపై బీజేపీ నాయకుడు సుర్జిత్ సేన్ మాట్లాడుతూ ‘‘ నిందితులను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తున్నాం. ఈ ప్రశాంతమైన ప్రాంతం నేడు నేరాలకు, నేరస్థులకు అడ్డాగా మారింది. ముఖ్యమంత్రిగా మహిళ ఉన్నప్పటికీ, మహిళలపై అత్యధిక నేరాలు జరిగే రాష్ట్రాల్లో పశ్చిమ బెంగాల్ ఒకటి కావడం విచారకరం.’’అని ఆయన అన్నారు. 

ఈ కేసులో కఠినమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆదేశించినట్లు టీఎంసీ సీనియర్ నాయకుడు, పర్యాటక శాఖ మంత్రి గౌతమ్ దేబ్ తెలిపారు. టీఎంసీ పార్టీ ప్రతినిధులు ఘటనా స్థలాన్ని సందర్శించి నేడు బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించనుందని ఆయన పేర్కొన్నారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo