ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Crime - Jul 27, 2020 , 22:42:16

డబుల్ బెడ్రూం ఇండ్ల పేరిట మోసం.. ఓ ఛానల్ చైర్మన్ అరెస్ట్

డబుల్ బెడ్రూం ఇండ్ల పేరిట మోసం.. ఓ ఛానల్ చైర్మన్ అరెస్ట్

హైదరాబాద్ : డబుల్ బెడ్రూం ఇండ్లను ఇప్పిస్తానంటూ పలువురిని మోసం చేసిన ఓ తెలుగు ఛానల్ యజమానిని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. దాదాపు 40 మందిని రూ. 70 లక్షల మేర మోసగించినట్లు దర్యాప్తులో తేలింది. 

సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ తెలిపిన వివరాల ప్రకారం.. తెలంగాణ ప్రభుత్వం పేదలకు ఇచ్చేందుకు రాష్ట్రవ్యాప్తంగా నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ఇండ్లను ఇప్పిస్తానంటూ తెలుగు న్యూస్ ఛానల్ విజన్-1 యజమాని అయిన జీ ప్రశాంత్ పలువురికి నమ్మకం కలిగించాడు. నిజాంపేట, కైతలాపూర్ వద్ద డబుల్ బెడ్రూం గృహాలను ప్రభుత్వం మీడియా సిబ్బందికి మంజూరు చేసిందని, వారికి కేటాయించిన ఇండ్లను మీకు వచ్చేట్లు చేస్తానని నమ్మబలికాడు. ఒక్కొక్కరి నుంచి రూ.1.70 లక్షల మేర తీసుకున్న ప్రశాంత్.. త్వరలోనే మీకు ఇండ్ల పట్టాలు ఇస్తారంటూ చెప్పుకొచ్చాడు. ఇండ్ల కేటాయింపు ఉత్తర్వులను రూపొందించేందుకు ఫొటోషాప్ సాఫ్ట్ వేర్ ను ఉపయోగించి దాదాపు 40 మందిని ఇలా మోసం చేశాడు.

పలువురు తాము మోసపోయామని గ్రహించి సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో .. సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్స్ బృందం, మాదాపూర్, కూకట్ పల్లి హౌసింగ్ బోర్డ్ పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టి ప్రశాంత్ ను అరెస్ట్ చేశారు.

ప్రస్తుతం కూకట్ పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీలో నివసిస్తున్న ప్రశాంత్.. తూర్పు గోదావరి జిల్లాకు చెందినవాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలోని పెద్దలతో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెప్పుకుంటూ ప్రజలను మోసం చేస్తున్నాడని పోలీసులు తెలిపారు. హైవేపై టోల్ గేట్ల వద్ద టోల్ చెల్లించకుండా ఉండేందుకు పోలీస్ ఐడీకార్డును చూపేవాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. అరెస్ట్ చేసిన తర్వాత అతడి నుండి రూ.8 లక్షల నగదు,  ఎస్ఐ నకిలీ గుర్తింపు కార్డును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

మోసం చేసిన కేసులో అతడ్ని ఇటీవల ఏపీలోని విజయవాడ పోలీసులు అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.


logo