శనివారం 19 సెప్టెంబర్ 2020
Crime - Aug 30, 2020 , 18:09:45

9నెలల చిన్నారితో సహా భవనంపై నుంచి దూకి టెకీ ఆత్మహత్య.. కారణం ఇదే!

9నెలల చిన్నారితో సహా భవనంపై నుంచి దూకి టెకీ ఆత్మహత్య.. కారణం ఇదే!

గుంటూరు : గుంటూరు జిల్లా లక్ష్మీపురంలో ఓ మహిళ తన తొమ్మిది నెలల చిన్నారితో భవనంపై నుంచి దూకి శనివారం ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాలు.. ప్రకాశం జిల్లా పంగలూరు గ్రామానికి చెందిన మనోగ్న(29)కు, అదే జిల్లా పర్చూరు మండలం అన్నంభోట్లవారిపాలెం గ్రామానికి చెందిన నర్రా కల్యాణ్‌ చంద్రతో మూడేండ్ల క్రితం వివాహం అయ్యింది. కల్యాణ్‌ ప్రైవేట్‌ ఉద్యోగి కాగా.. మనోగ్న సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌. వృత్తి రీత్యా భార్యాభర్తలిద్దరూ హైదరాబాద్‌లో నివాసం ఉండేవారు. వీరికి 9నెలల పాప ఉండగా.. లాక్‌డౌన్‌ కారణంగా ఉద్యోగం వదిలేసి భార్యభర్తలిద్దరూ గుంటూరులోని లక్ష్మీపురానికి వచ్చి అత్తామామలతో కలిసి ఓ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్నారు. వివాహ సమయంలో మనోగ్నకు 5తులాల బంగారం, ఐదెకరాలు భూమి, రూ.2 లక్షల నగదు, ఓ ఇల్లు కట్నంగా ఇచ్చారు. 

అయినా భర్త, అత్త మనోగ్నను మరింత కట్నం తేవాలని నిత్యం వేధించేవారు. పదేపదే కట్నం డిమాండ్‌ చేయడంతో తీవ్ర మనస్థాపానికి గురైన మనోగ్న శనివారం సాయంత్రం తన తొమ్మిది నెలల పసికందు తులసితో తాను నివసిస్తున్న అపార్ట్‌మెంట్‌ ఐదో అంతస్తుకు వెళ్లింది. మొదట చిన్నారిని విసిరేసి.. తరువాత తాను కూడా దూకేసింది. పసికందు అక్కడికక్కడే మృతి చెందగా.. తీవ్రంగా గాయపడిన మనోగ్నను దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మరణించిందని పోలీసులు తెలిపారు. మనోగ్న తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు భర్త, అత్తపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని విచారణ చేపడుతున్నారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo