ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Crime - Sep 11, 2020 , 20:04:42

అనుమానం పెనుభూతమై.. భర్త చేతిలో భార్య దారుణ హత్య

అనుమానం పెనుభూతమై.. భర్త చేతిలో భార్య దారుణ హత్య

భద్రాద్రి కొత్తగూడెం : తాళి కట్టిన భర్తే ఆమె పాలిట యముడయ్యాడు. కలకాలం కలిసుంటానని ప్రమాణం చేసినవాడే భార్యను కర్కశంగా కడతేర్చాడు. భర్త చేతిలో భార్య అతిదారుణంగా హత్యకు గురైన విషాద సంఘటన జిల్లాలోని బూర్గంపహాడ్ మండల పరిధిలోని సారపాక గ్రామం గాంధీనగర్లో చోటుచేసుకుంది. కుటుంబసభ్యుల కథనం మేరకు..టేకులపల్లి మండలం శూలానగర్ గ్రామానికి చెందిన గడ్డికొప్పుల జనార్ధన్ కు గత ఐదేండ్ల క్రితం బూర్గంపహాడ్ మండల పరిధిలోని సారపాక గాంధీనగర్ కు చెందిన బి.ఆనందరావు కుమార్తె అనూషతో వివాహం జరిగింది. 

వారికి ఇద్దరు కుమార్తెలు లేఖనప్రియ, హర్షితలు ఉన్నారు. భార్యభర్తల మధ్య గత ఏడాది కాలంగా చిన్నపాటి గొడవలు తలెత్తిన నేపథ్యంలో భార్యపై భర్త జనార్ధన్ అనుమానం పెంచుకున్నాడు. ఈ క్రమంలో ఐదు రోజుల క్రితం భార్యభర్తల మధ్య గొడవ జరగడంతో మూడు రోజుల క్రితం భార్య అనూష తన ఇద్దరు కుమార్తెలను తీసుకుని సారపాకలోని గాంధీనగర్లో ఉన్న తన పుట్టింటికి వచ్చేసింది. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో తల్లిదండ్రులు అల్లుడు జనార్ధన్ కు ఫోన్ చేసి నీ పద్ధతి బాగాలేదు.. మార్చుకోవాలంటూ ప్రతిసారి ఇలాగే గొడవలు పెట్టుకుంటారా...అంటూ మందలించి ఇంటికి రావాలని చెప్పారు. గురువారం తన అత్తగారిల్లు గాంధీనగర్ కు వచ్చిన అల్లుడిని అత్తమామలు మందలించారు.

వాళ్ల ముందు బాగానే ఉంటున్నట్లు నమ్మించి ఎలాంటి గొడవలు పెట్టుకోనని నమ్మబలికి తనతో భార్యను ఇంటికి పంపాలని వేడుకోవడంతో రెండు, మూడురోజులు నువ్వు కూడా ఇక్కడే ఉండాలని, ఆ తర్వాత పంపుతామని చెప్పారు. శుక్రవారం తన ఆత్తమామలు కొత్తగూడెంలో తన బంధువు కర్మ నిమిత్తం బయటకు వెళ్లడంతో మధ్యాహ్నం ఇదే అనుకూల సమయంగా భావించి పక్కా పథకం ప్రకారం ఎఇంట్లోనే టీవీ చూస్తున్న భార్యపై ఒక్కసారిగా కత్తితో దాడి చేశాడు. దీంతో అనూష తీవ్ర రక్తస్రావంతో అక్కడికక్కడే మృతి చెందింది. కేకలు విన్న స్థానికులు అక్కడకు పరుగులు పెట్టే లోగానే భర్త పరారయ్యాడు.  స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

సంఘటనా స్థలాన్ని పాల్వంచ డీఎస్పీ కేఆర్కే ప్రసాద్, ఎస్సై బమ్మెర బాలకృష్ణ సందర్శించారు. హత్య ప్రదేశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి మృతికి గల కారణాలను కుటుంబసభ్యులను అడిగి తెలుసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని బూర్గంపహాడ్ ప్రభుత్వ దవాఖానకి తరలించారు. తండ్రి ఆనందరావు ఫిర్యాదు మేరకు కేసునమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, జనార్ధన్ స్థానిక పోలీస్ స్టేషన్లో లొంగిపోయినట్లు తెలిసింది.


logo