బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతం.. నిందితులను పట్టించిన సెల్‌ఫోన్

సూర్యాపేట : సూర్యాపేటలో బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతంగా ముగిసింది. జిల్లా కేంద్రంలో శనివారం రాత్రి కిడ్నాప్ గురైన గౌతమ్ (5)ను 24 గంటల్లోనే పోలీసులు సురక్షితంగా రక్షించారు. నిందితుల సెల్‌ఫోనే వారిని పట్టించింది. ఎస్పీ భాస్కరన్ తెలిపిన వివరాలివి.. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని భగత్ సింగ్ నగర్లో నివాసముంటున్న మహేశ్, నాగలక్ష్మి దంపతులకు కుమారుడు మహేశ్ (5) ఏకైక కుమారుడు. దీపావళి కావడంతో శనివారం సాయంత్రం పటాకులు కాల్చిందుకు అగ్గిపెట్టె కోసం సమీపంలోని దుకాణం వద్ద వెళ్లాడు. ముగ్గురు బైక్‌పై వచ్చి బాలుడిని కిడ్నాప్ చేశారు.
అక్కడి నుంచి మిర్యాలగూడకు తీసుకెళ్లారు. వీరిలో ఒకరు ఆదివారం ఉదయం బాబును తీసుకొని హైదరాబాద్ వెళ్లాడు. మిగిలిన ఇద్దరు అంతకుముందే ప్రణాళిక ప్రకారం సేకరించిన బాలుడి ఇంటి వెంట ఉన్న టైలర్, ఓ షాపు యజమాని సెల్‌ఫోన్ నెంబర్‌కు ఫోన్ చేసి గౌతమ్ తండ్రి ఫోన్ నెంబర్ తెలుసుకొని అతడికి ఫోన్ చేశారు. పది లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిందితులు రోడ్డుపై వెళ్లే వారి ఫోన్లను ఇందుకు వినియోగించారు. తాము డయల్ చేసిన నంబర్‌ను బ్లాక్ లీస్టులో పెట్టి ఆధారాలు దొరకకుండా చేశారు. పోలీసుల సూచనతో కిడ్నాపర్లకు రూ.7లక్షలు ఇచ్చేందుకు మహేశ్ అంగీకరించాడు.
దీంతో నిందితులు తమ సెల్‌ఫోన్‌తో మహేశ్ ఫోన్‌కు రింగ్ ఇచ్చి కట్ చేశారు. ఆ నంబర్ ఆధారంగా మిర్యాలగూడలో నిందితుడిని అరెస్టు చేసి బాలుడిని రక్షించారు. మరో ఇద్దరిని మాచర్లలో అరెస్టు చేశామని, నిందితుల్లో ఇద్దరు మైనర్లని ఎస్పీ పేర్కొన్నారు. జల్సాలకు అలావాటుపడి సులువుగా డబ్బులు సంపాదించాలన్న ఉద్దేశంతో నేరానికి పాల్పడినట్లు చెప్పారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.