బుధవారం 23 సెప్టెంబర్ 2020
Crime - Jul 05, 2020 , 19:52:52

కరోనా సోకిందని భయపడి ఆత్మహత్య

కరోనా సోకిందని భయపడి ఆత్మహత్య

హైదరాబాద్‌ : కరోనా వైరస్ తనకు సోకిందేమోనన్న భయంతో ఓ వ్యక్తి హుస్సేన్‌సాగర్‌లో దూకి ఆత్మహత్య చేసుకొన్ని ఘటన హైదరాబాద్‌లో  జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమ బెంగాల్‌కు చెందిన పల్తుపాన్‌ అనే వ్యక్తి హైదరాబాద్‌కు బ్రతుకుదెరువు నిమిత్తం వచ్చి గత కొన్నేండ్లుగా దూద్‌బౌలీ  ప్రాంతంలో కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. గత వారం రోజులుగా ఎడతెరిపి లేని దగ్గు, జలుబుతో బాధపడుతున్న పల్తుపాన్‌.. గత శుక్రవారం శ్వాసతీసుకోవడంలో ఇబ్బందిపడ్డాడు. దీనికి పాతబస్తీలోని ఓ ప్రైవేట్‌ దవాఖానను ఆశ్రయించగా.. మలక్‌పేట వెళ్లి కరోనా వైరస్‌ నిర్ధరణ పరీక్షలు చేయించుకొని మందులు వాడాలని అక్కడ సూచించారు. ప్రైవేట్‌ దవాఖానలో చికిత్స తీసుకోవడానికి చాలా ఖర్చు అవుతున్నందున భయపడిపోయిన పల్తుపాన్‌.. గాంధీ దవాఖానకు వెళ్తానని చెప్పి వెళ్లకుండానే ఇంటి వద్ద గడిపాడు. 

కాగా, శుక్రవారం తన స్నేహితుడు శ్రీధామ్‌ అడక్‌ను పిలిచి.. స్వచ్ఛమైన గాలి పీల్చుకునేందుకు హుస్సేన్‌సాగర్‌కు పోదామని చెప్పి ఒప్పించి ఇద్దరు కలిసి హుస్సేన్‌సాగర్‌కు వచ్చారు. కొద్దిదూరం ఇద్దరు కలిసి ఫుట్‌పాత్‌పై నడిచిన తర్వాత ఒక్కసారిగా పల్తుపాన్‌ హుస్సేన్‌సాగర్‌లోకి దూకేశాడు. తన స్నేహితుడు హుస్సేన్‌సాగర్‌లో దూకి ఆత్మహత్య చేసుకొన్నాడని శ్రీధామ్‌ అడక్‌ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు వచ్చే సరికి పల్తూపాన్‌ ప్రాణాలు వదిలాడు. 

దగ్గు, జలుబు ఎక్కువగా వస్తున్నందున తనకు కూడా కరోనా వైరస్‌ సోకి వుంటుందన్న అనుమానం పెంచుకొని ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని ఆయన కుటుంబసభ్యులు చెప్పారు. ఆదివారం ఉదయం మృతదేహాన్ని హుస్సేన్‌సాగర్‌ నుంచి బయటకు తీసిన రాంగోపాల్‌ పేట పోలీసులు కేసు నమోదు చేసుకొని ఎస్‌ఐ లక్ష్మణ్ నేతృత్వంలో దర్యాప్తు చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్‌లోడ్ చేసుకోండి.


logo