కమీషన్ల కక్కుర్తిలో స్టాక్ బ్రోకరింగ్ సంస్థలు!

హైదరాబాద్: స్టాక్ బ్రోకరింగ్ సంస్థలను నమ్మి.. స్టాక్స్‌ను వాళ్ల చేతిలో పెట్టారా?.. డీమ్యాట్ ఖాతా ఆపరేటింగ్ మొత్తం బాధ్యత బ్రోకరింగ్ సంస్థ చేతిలో ఉందా?.. ఒక్కసారి మీ షేర్ క్రయ విక్రయాలు పరిశీలించండి... తాజాగా సీసీఎస్ పోలీసులు వెలుగులోకి తెచ్చిన బ్రోకరింగ్లో చీటింగ్ కోణం ఇప్పుడు స్టాక్ బ్రోకరింగ్ సంస్థలపై ఆధారపడిన వారిని కలవర పెడుతుంది.
అమెరికాలో ఉండే రామారావు నాగరాజ్ దంపతులకు సంబంధించిన డీమ్యాట్ ఖాతాను ఆపరేట్ చేసిన కార్వీ స్టాక్ బ్రోకరింగ్ లిమిటెడ్ తార్నాక శాఖ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్లు కేవలం తమ కంపెనీలకు వచ్చే బ్రోకరేజి పర్సెంటేజీల కోసం స్టాక్స్ క్రయ విక్రయాలు చేసి కోటి రూపాయలు స్వాహా చేశారు. బాధితుడిచ్చిన ఫిర్యాదుతో సోమవారం సీసీఎస్ ఏసీపీ ఎస్వీ హరికుమార్ నేతృత్వంలోని బృందం కార్వీ సంస్థ తార్నాక బ్రాంచ్ మేనేజర్ మౌనిక, అసిస్టెంట్ మేనేజర్ వసుంధరలను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసుతో ఇప్పుడు బ్రోకరింగ్ సంస్థలకు సంబంధించిన కక్కుర్తి బయటకు వచ్చింది. దీంతో స్టాక్ బ్రోకరింగ్ సంస్థలపై ఆధారపడి షేర్స్‌లో పెట్టుబడులు పెడుతున్న వారు ఆందోళన చెందుతున్నారు. అయితే.. చాలా మంది బాధితులు ఈ విషయం తెలియక గుడ్డిగా, మార్కెట్‌పై అవగాహన ఉంటుందనే ఉద్దేశ్యంతో షేర్ బ్రోకరింగ్ సంస్థల చేతికి తమ స్టాక్స్‌కు సంబంధించిన పూర్తి అధికారాలు ఇస్తున్నారు. ఇక్కడ స్టాక్స్‌లో నష్టం చూపకపోయినా.. స్టాక్స్ కొనడం, అమ్మడంలో జరిగే లావాదేవీల్లో బ్రోకరింగ్ సంస్థలకు కమీషన్ వెళ్తుంది. స్టాక్స్‌లో బ్రోకరింగ్ సంస్థలు 0.1 శాతం నుంచి 0.75 శాతం ఆయా స్టాక్స్‌పై జరిగే లావాదేవీల్లో కమీషన్ వసూలు చేస్తున్నాయి. మరికొన్ని సంస్థలు జరిగే లావాదేవీలపై పిక్స్డ్గా కొంత మొత్తం వసూలు చేస్తుంటాయి. పేరున్న సంస్థలు, వ్యక్తిగతంగా బ్రోకరింగ్ నిర్వహించే వారి లావాదేవీల్లో ఒక శాతం నుంచి 2 శాతం వరకు కూడా వసూలు చేస్తుంటారు. మరికొందరు పిక్స్డ్ వసూలు చేస్తూ స్టాక్స్ క్రయ విక్రయాలు చేస్తుంటారు.
అనవసరంగా క్రయ విక్రయాలు..!
బ్రోకరేజి సంస్థలు.. తమ కమీషన్ల కోసం స్టాక్స్‌ను అనవసరంగా క్రయ విక్రయాలు జరుపుతున్నాయి. ఇప్పటి వరకు కొన్ని స్టాక్ బ్రోకరింగ్ సంస్థలు.. కొందరి పెట్టుబడుదారుల కండ్లు కప్పి మోసాలకు పాల్పడ్డాయని.. సీసీఎస్ పోలీసుల విచారణలో వెల్లడి కావడంతో ఇప్పుడు ఇది స్టాక్స్ పెట్టుబడుదారుల్లో చర్చనీయాంశంగా మారింది. బయటకు స్టాక్స్ క్రయ విక్రయాలుగా చూపిస్తూ, లోపల కమీషన్లను లాగేసుకున్న బ్రోకరేజి సంస్థలపై మరిన్నీ ఫిర్యాదులు వచ్చే అవకాశాలున్నాయని పోలీసులు భావిస్తున్నారు. అవసరం లేకున్నా ఉత్తిత్తిగానే షేర్స్ కొనడం, అదే రేట్లో మళ్లీ అమ్మడం చేస్తూ బ్రోకరేజి సంస్థలు కమీషన్లు కొట్టేస్తున్నాయి. దీంతో స్టాక్ బ్రోకరింగ్ సంస్థల విషయంలో పెట్టుబడుదారులు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
నమ్మించి.. బోల్తా కొట్టిస్తాయి
బ్రోకరింగ్ సంస్థల ద్వారా ఎంత ఎక్కువ లావాదేవీలు జరిగితే.. ఖాతాదారులకు అంత కమీషన్ వస్తుంది. అయితే.. ఇక్కడే బ్రోకరింగ్ సంస్థలు పెట్టుబడుదారులను బోల్తా కొట్టిస్తుంటాయి. బ్రోకరింగ్ సంస్థల చేతికి డీమ్యాట్ ఖాతా పాస్వర్డ్ ఇచ్చేస్తే .. అందులో ఉన్న స్టాక్స్‌కు సంబంధించిన క్రయ విక్రయాలన్నీ ఆ బ్రోకరింగ్ సంస్థనే చూసుకుంటుంది. అలాంటివారి ఖాతాల్లో అవసరం లేకున్నా ఉత్తుత్తిగానే ఎక్కువ లావాదేవీలు జరిపిస్తూ.. తమకు ఎక్కువ కమీషన్ వచ్చే విధంగా చేస్తుంటాయి. సీసీఎస్‌లో నమోదైన కేసులో అమెరికాలో ఉండే రామారావు నాగరాజ్ దంపతులు 1995కు ముందు నుంచే షేర్స్‌లో పెట్టుబడులు పెట్టారు. 1999లో వాటిని డిజిటల్ ఫార్మాట్లోకి మార్చుకోవడం కోసం తార్నాక కార్వీ బ్రాంచ్‌లో డీమ్యాట్ ఖాతా తెరిచారు. షేర్స్ డిజిటల్ ఫార్మాట్లోకి వచ్చిన తరువాత స్టాక్స్ కొనేవారికి డీమ్యాట్ ఖాతా తప్పని సరిగా అవసరముంటుంది. ఈ క్రమంలోనే 2018లో రామారావు దంపతులు హైదరాబాద్‌కు వచ్చినప్పుడు అప్పటి వరకు యాక్టివ్‌గా లేని తమ డీమ్యాట్ ఖాతాను యాక్టివేట్ చేయించారు. అప్పటికే అందులో కోటి రూపాయల విలువైన స్టాక్స్ ఉన్నాయి. బాధితులు అమెరికాలో ఉండటంతో మార్కెట్లో వచ్చే హెచ్చుతగ్గుల సమయంలో తాము మీకు కావాల్సినట్లుగా షేర్స్ క్రయ, విక్రయాలు చేసి పెడుతామంటూ నమ్మించిన బ్రోకరింగ్ సంస్థ ప్రతినిధులు ... వాళ్ల నుంచి వారి ఖాతాకు సంబంధించిన అన్ని అనుమతుల కోసం ఖాళీ డాక్యుమెంట్లపై సంతకాలు తీసుకున్నారు. అయితే షేర్స్ అమ్మడం, కొనడంతో నష్టం లేకుండా.. ఉన్న కోటి రూపాయలను తమ బ్రోకరేజి కమీషన్ల కింద జమయ్యే విధంగా క్రయ విక్రయాలు జరిపారు. ఇప్పుడు ఇదే విషయం.. అందరిలో ఆందోళన కల్గిస్తుంది. సీసీఎస్ పోలీసుల దర్యాప్తుతో అవసరం లేకున్నా ఉత్తిత్తిగానే షేర్స్ కొనడం, అదే రేట్లో మళ్లీ అమ్మడం చేస్తూ కమీషన్లు కొట్టేసిన బ్రోకరేజి సంస్థల్లో ఇప్పుడు గుబులు మొదలయ్యింది.
తాజావార్తలు
- అయోధ్యలో మసీదు నిర్మాణ పనులు షురూ..
- ఉర్దూ పాఠ్య పుస్తకాలను ఆవిష్కరించిన మంత్రి కొప్పుల
- ర్యాలీలో అపశృతి.. ట్రాక్టర్ బోల్తాపడి రైతు మృతి
- డైరెక్టర్ సాగర్ చంద్రనా లేదా త్రివిక్రమా..? నెటిజన్ల కామెంట్స్
- భూమిపై రికార్డు వేగంతో కరుగుతున్న మంచు
- బుద్ధిలేనోడే ఆ ఆల్‌రౌండర్‌కు రూ.10కోట్లు చెల్లిస్తారు!
- రైతుల హింసాత్మక ర్యాలీపై హోంశాఖ అత్యవసర సమావేశం
- అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి ఎర్రబెల్లి
- యువతిపై గ్యాంగ్ రేప్..
- అమెరికా తొలి మహిళా ఆర్థిక మంత్రిగా జానెట్ యెల్లెన్!