శుక్రవారం 04 డిసెంబర్ 2020
Crime - Oct 29, 2020 , 11:00:46

హైద‌రాబాద్‌లో దారుణం.. అత్త చేతిలో అల్లుడు హ‌త్య‌

హైద‌రాబాద్‌లో దారుణం.. అత్త చేతిలో అల్లుడు హ‌త్య‌

హైద‌రాబాద్ : న‌గ‌రంలోని రామంతాపూర్‌లో దారుణం జ‌రిగింది. త‌న బిడ్డ ఆత్మ‌హ‌త్య‌కు ప్ర‌తీకారంగా అల్లుడిని హ‌త్య చేసింది అత్త‌. వివ‌రాల్లోకి వెళ్తే.. రామంతాపూర్‌కు చెందిన న‌వీన్‌కు మీర్‌పేట‌కు చెందిన ఓ యువ‌తితో వివాహ‌మైంది. పెళ్లి అయిన నెల‌కే న‌వీన్ భార్య ఆత్మ‌హ‌త్య చేసుకుంది. దీంతో మృతురాలి త‌ల్లి అనిత.. న‌వీన్‌పై మీర్‌పేట పోలీసు స్టేష‌న్‌లో ఫిర్యాదు చేసింది. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టి.. న‌వీన్‌ను జైలుకు త‌ర‌లించారు. ఇటీవ‌లే న‌వీన్ జైలు నుంచి విడుద‌ల అయ్యాడు. విష‌యం తెలుసుకున్న అత్త అనిత‌.. రామంతాపూర్‌లోని న‌వీన్ ఇంటికి గురువారం ఉద‌యం చేరుకుంది. అల్లుడిపై క‌త్తితో దాడి చేసి చంపింది అనిత‌. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న ఉప్ప‌ల్ పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. న‌వీన్ మ‌రో అమ్మాయితో వివాహేత‌ర సంబంధం కొన‌సాగించ‌డం వ‌ల్లే అత‌ని భార్య ఆత్మ‌హ‌త్య చేసుకుంద‌ని, ఆ కోపంతోనే అనిత ఈ దారుణానికి ఒడిగ‌ట్టి ఉండొచ్చ‌ని పోలీసులు భావిస్తున్నారు.  

తాజావార్తలు