ఆదివారం 29 నవంబర్ 2020
Crime - Oct 26, 2020 , 19:12:04

లోనవ్లాలో శివసేన నాయకుడు రాహుల్‌ షెట్టి దారుణహత్య

లోనవ్లాలో శివసేన నాయకుడు రాహుల్‌ షెట్టి దారుణహత్య

ముంబై : లోనావ్లా పట్టణం శివసేన నాయకుడు రాహుల్ షెట్టి దారుణహత్యకు గురయ్యారు. సోమవారం ఉదయం తన ఇంటికి సమీపంలోని టీ కొట్టు వద్ద ఉన్న రాహుల్‌పై కొందరు దుండగులు తుపాకీతో కాల్చడంతో అక్కడికక్కడే చనిపోయాడు.

పుణే నగరానికి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న లోనావ్లాలోని హిల్ స్టేషన్‌లోని జయచంద్ చౌక్ వద్ద శివసేన లోకల్‌ యూనిట్‌ మాజీ చీఫ్‌గా ఉన్న రాహుల్‌ షెట్టిపై సోమవారం ఉదయం దుండగులు కాల్పలు జరిపారు. తన ఇంటి సమీపంలోని టీ స్టాల్ వద్ద ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపి పరారయ్యారు. షెట్టి తలకు, ఛాతీకి బుల్లెట్‌ గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు సమీపంలోని ప్రైవేటు దవాఖానకు తరలించగా.. అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. సంఘటనా స్థలానికి చేరుకుని విచారించిన పోలీసులు.. వేలిముద్రలు, ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం సీసీటీవీ ఫుటేజీ ద్వారా ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. దాడి వెనుక ఉద్దేశాలు ఇంతవరకు తెలియరాలేదని పోలీసులు చెప్పారు. దర్యాప్తు గురించి మరింత సమాచారం వెల్లడించడానికి సూపరింటెండెంట్ అభినవ్ దేశ్‌ముఖ్ నిరాకరించారు. కనీసం ఇద్దరు దుండగులు కాల్పులు జరిపి ఉంటారని, వారిలో ఒకరు టీ షాప్ వెలుపల ఉన్నప్పుడు షెట్టిపై మూడు రౌండ్లు కాల్చారని" అని దేశ్‌ముఖ్ చెప్పారు. తన ప్రాణాలకు హాని ఉన్నదని, తనను ఎప్పుడైనా హత్య చేసే అవకాశాలు ఉన్నాయని లోనావ్లా నగర పోలీస్‌ స్టేషన్‌లో సమాచారం ఇచ్చినప్పటికీ పోలీసులు పట్టించుకోలేదని షెట్టి కుటుంబసభ్యులు, స్నేహితులు ఆరోపించారు. షెట్టి తండ్రి ఉమేష్ కూడా 30 ఏండ్ల క్రితం లోనావ్లాలో వ్యక్తిగత శత్రుత్వం కారణంగా హత్యకు గురయ్యాడు.

మరొక సంఘటనలో, ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో హనుమాన్ టెక్డి సమీపంలో గణేష్ నాయుడుపై దుండగులు పదునైన ఆయుధాలతో దాడి చేసి హత్యగావించారు. ఈ సంఘటనలో దుండగుల్లో ఒకరికి కూడా గాయాలయ్యాయి. ప్రస్తుత అతను దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. ఈ రెండు సంఘటనలపై లోనావ్లా నగర పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.