శుక్రవారం 04 డిసెంబర్ 2020
Crime - Oct 21, 2020 , 19:03:09

రౌడీ షీట‌ర్ హ‌త్య కేసులో ఏడుగురి అరెస్టు

రౌడీ షీట‌ర్ హ‌త్య కేసులో ఏడుగురి అరెస్టు

హైదరాబాద్ : రౌడీ షీటర్ సయ్యద్ వహీద్ అలీ హత్య కేసుకు సంబంధించి న‌గ‌రంలోని పహడీషరీఫ్ పోలీసులు బుధవారం ఏడుగురిని అరెస్టు చేశారు. బాలాపూర్‌లోని జ‌ల్‌ప‌ల్లి చెరువు స‌మీపంలో అలీ ప‌ది రోజుల‌క్రితం హ‌త్య‌కు గుర‌య్యాడు. అరెస్టు అయిన వారిని షేక్ ఇస్మాయిల్ (24), సయ్యద్ జహీరుద్దీన్ (35), సయ్యద్ అబిద్ (19), మొహద్ ఖాజా షాబాజ్ (20), మొహద్ షాబాజ్ (20), మొహద్ ఒమర్ (20), మొహద్ అమీర్ (20)గా గుర్తించారు. కాగా మున్నీ బీ అనే మ‌రో నిందితుడు పరారీలో ఉన్నాడు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వహీద్ అలీ మూడేళ్ల క్రితం జైలులో షేక్ ఇస్మాయిల్‌ను కలిశాడు. జైలు నుండి విడుదలయ్యాక ఇరువురి స్నేహం కొన‌సాగింది. తరచూ కలుసుకునేవారు. అయితే గతేడాదిగా అలీ తన నేర కార్యకలాపాలు, కదలికల గురించి పోలీసులకు సమాచారం ఇస్తున్నాడని షేక్ ఇస్మాయిల్ అనుమానం పెంచుకున్నాడు. త‌న క‌ద‌లిక‌ల‌పై పోలీసులు నిరంత‌రం నిఘా ఉంచ‌డ‌మే ఇందుకు కార‌ణంగా భావించాడు. ఈ నేప‌థ్యంలో ఇతర నిందితులతో క‌లిసి అలీని ఇంటి నుండి తీసుకువెళ్లాడు.

అంద‌రూ క‌లిసి తాగిన అనంత‌రం నిర్మానుష్య ప్ర‌దేశానికి తీసుకెళ్ళి అతనిని పొడిచి చంపారు. వీరంద‌రికి మున్నీ బీ తన అద్దె ఇంట్లో ఆశ్రయం క‌ల్పించింద‌ని పోలీసులు తెలిపారు. షేక్ ఇస్మాయిల్‌, స‌య్య‌ద్ జ‌హీరుద్దీన్ రాజేంద్ర‌న‌గ‌ర్‌, సంతోష్‌న‌గ‌ర్‌, మాదాపూర్‌, ప‌హ‌డీష‌రీఫ్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో వివిధ కేసుల్లో నిందితులుగా ఉన్నారు. నిందితులంద‌రినీ అరెస్టు చేసి కోర్టులో హాజ‌రు ప‌రిచిన‌ట్లు పోలీసులు తెలిపారు. ప్ర‌స్తుతం జ్యూడిషియ‌ల్ క‌స్ట‌డీలో ఉన్న‌ట్లు పేర్కొన్నారు.