శుక్రవారం 22 జనవరి 2021
Crime - Nov 20, 2020 , 17:33:41

సూర్యాపేట జిల్లాలో 12కిలోల గంజాయి పట్టివేత

సూర్యాపేట జిల్లాలో 12కిలోల గంజాయి పట్టివేత

సూర్యాపేట రూరల్‌ : అక్రమంగా తరలిస్తున్న 12 కిలోల గంజాయిని సూర్యాపేట పోలీసులు పట్టుకుని నిందితుడిపై కేసు నమోదు చేశారు.  జిల్లా కేంద్రంలోని రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సూర్యాపేట డీఎస్పీ మోహన్‌కుమార్‌ వివరాలు వెల్లడించారు. సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్‌ మండలం లాల్‌సింగ్‌తండాకు చెందిన భూక్య రాము రూ.లక్షా 20వేల విలువైన 12కిలోల గంజాయిని తన కారులో పెన్‌పహాడ్‌ నుంచి సూర్యాపేట వైపు తీసుకెళ్తున్నాడు.

 విశ్వసనీయ సమాచారం మేరకు సూర్యాపేట మండలం ఇమాంపేట గ్రామ స్టేజీ వద్ద శుక్రవారం తెల్లవారుజామున రూరల్‌ పోలీసులు, సీసీఎస్‌ పోలీసులు పట్టుకున్నారు. గంజాయిని, కారును స్వాధీనం చేసుకొని, నిందితుడిపై కేసు నమోదు చేశారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం దారుకొండ నుంచి గంజాయిని మహారాష్ట్రకు తరలిస్తున్నట్లు నిందితుడు అంగీకరించాడు. జిల్లాలో ఇప్పటివరకు సుమారు 200 కిలోల గంజాయిని పట్టుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. గంజాయిని పట్టుకున్న సీసీఎస్‌ సీఐ నిరంజన్‌, ఎస్‌ఐ శ్రీనివాస్‌ను అభినందించారు. సమావేశంలో సీఐ విఠల్‌రెడ్డి, పోలీస్‌ సిబ్బంది ఉన్నారు. 

logo