మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Crime - Sep 09, 2020 , 16:29:34

కస్టమర్ల ఖాతాల నుంచి రూ.3 కోట్లు మాయం

కస్టమర్ల ఖాతాల నుంచి రూ.3 కోట్లు మాయం

ఇండోర్ : బ్యాంక్ మేనేజర్ చేతివాటంతో కస్టమర్ అకౌంట్ నుంచి రూ.3 కోట్లు మాయమయ్యాయి. 49 ఖాతాల నుంచి డబ్బు మళ్లించినట్లు ఆర్థిక నేరాల పరిశోధన సెల్ వెల్లడించింది. ఈ ఘటన ఇండోర్ లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సియాగంజ్ బ్రాంచ్ లో జరిగింది. మేనేజర్ శ్వేతా దారువాలాతోపాటు మరో ఉద్యోగి కౌస్తుబ్ సింగారేపై మోసం, ఫోర్జరీ కేసులు నమోదయ్యాయి.  

గత కొంతకాలంగా జమ చేస్తున్న డబ్బు తమ తమ అకౌంట్లలో చేరకపోవడాన్ని గుర్తించిన పలువురు ఖాతాదారులు ఎస్బీఐ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఉన్నతాధికారుల సూచన మేరకు రంగంలోకి దిగిన ఆర్థిక నేరాల పరిశోధన సెల.. అసలు నేరస్థులు ఇంటి దొంగలే అని తేల్చారు. అందునా బ్యాంకు మేనేజర్, మరో ఉద్యోగి కుమ్మక్కై ఇలాంటి పనులకు పాల్పడుతున్నట్లు చెప్పారు. నగదు జమ చేసేందుకు వచ్చిన ఖాతాదారుల నుంచి డబ్బు తీసుకుని వారి ఖాతాల్లో వేసి అక్కడి నుంచి ఇతర ఖాతాలకు బదిలీ చేశారు. ఇలా 49 ఖాతాల నుంచి దాదాపు రూ.3 కోట్ల మేర మోసానికి పాల్పడ్డారు. నిందితులు అసంపూర్ణ పత్రాలపై వ్యక్తిగత రుణాలు, వాహన, గృహ రుణాలను కూడా ఇచ్చారు. చాలా సందర్భాల్లో దరఖాస్తుదారుడు తన పేరిట రుణం ఉన్న విషయం కూడా తెలియకుండా మోసాలు చేస్తున్నట్లు ఈవోడబ్ల్యూ తేల్చింది.

వినియోగదారుల ఫిర్యాదు తరువాత బ్యాంకు లావాదేవీలను 2018 ఏప్రిల్ 16 నుంచి 2019 జూలై 5 వరకు తనిఖీ చేశారు. వినియోగదారులు జమ చేసిన కొద్ది మొత్తాన్ని వివిధ బ్రాంచ్ ఖాతాల్లో జమ చేసినట్లు కనుగొన్నారు. నెఫ్ట్ బదిలీ, కనీస బ్యాలెన్స్ ఛార్జ్ రివర్సల్, పీపీఎఫ్ ఖాతా , లావాదేవీలు లేని ఖాతాల నుంచి పెద్ద మొత్తాలను విత్ డ్రా చేసుకున్నారు. అలాగే, రుణాలు తీసుకున్న వ్యక్తులు ఇచ్చిన పత్రాలను ఉపయోగించి రెండో సారి రుణాలను మంజూరు చేసినట్లు ఈవోడబ్ల్యూ వెల్లడించింది. దాంతో బ్యాంకు మేనేజర్ శ్వేతా దారువాలాతోపాటు ఉద్యోగి కౌస్తుబ్ సింగారేపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి విచారిస్తున్నారు.


logo