ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Crime - Jul 19, 2020 , 16:36:18

బాంబుతో ఏటీఎంను పేల్చి నగదు అపహరణ

బాంబుతో ఏటీఎంను పేల్చి నగదు అపహరణ

పన్నా : మధ్యప్రదేశ్ రాష్ట్రం పన్నా జిల్లాలోని సిమారియాలో దొంగలు స్టేట్ బ్యాంకు ఏటీఎంను దోచుకున్నారు. బాంబులతో పేల్చి ఏటీఎంను పగులగొట్టి దాదాపు రూ.7 లక్షలు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన సిమారియా పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం అర్ధరాత్రి జరిగింది. 

సిమారియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎంలోకి చొరబడిన ఇద్దరు గుర్తు తెలియని ముసుగులు ధరించిన వ్యక్తలు డైనమైట్ తో ఏటీఎంను పగులగొట్టారు. ఏటీఎంలోని సుమారు రూ.7 లక్షల నగదును సంచుల్లో నింపుకుని పారిపోయారు. ముఖాలకు ముసుగులు వేసుకున్న ఇద్దరు వ్యక్తులు షట్టర్ తెరవడానికి ప్రయత్నించారని, అది తెరుచుకోకపోవడంతో కట్టర్ సాయంతో షట్టర్ ను కోసి లోనికి ప్రవేశించినట్లు పోలీసులు గుర్తించారు. సమీపంలో ఉన్న ఓ గార్డు పోలీసులకు సమాచారం ఇచ్చేంతలోపల బాంబుతో ఏటీఎంను పేల్చి అందులోని డబ్బుతో పరారయ్యారని సమాచారం.

గార్డు సమాచారం మేరకు పోలీసు బృందం సంఘటన స్థలానికి చేరుకుని, గుర్తుతెలియని దుండగుల కోసం వెతకడం ప్రారంభించారు. ఏటీఎంలో సుమారు రూ.9 లక్షల నగదు ఉండగా.. రూ. 7 లక్షలు దోచుకున్నట్టు బ్యాంకు అధికారులు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం రాగానే జిల్లా ఉన్నతాధికారులు కూడా సంఘటన స్థలానికి చేరుకున్నారు. పోలీసులు సరిహద్దులో తనిఖీలు ముమ్మరం చేశారు. ఏటీఎం పరిసరాల్లోని సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ ను పోలీసులు పరిశీలిస్తున్నారు.


logo