శనివారం 26 సెప్టెంబర్ 2020
Crime - Aug 27, 2020 , 15:14:00

ఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్‌తో స‌హా కోడి పందాల నిర్వాహాకులు అరెస్టు

ఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్‌తో స‌హా కోడి పందాల నిర్వాహాకులు అరెస్టు

యాదాద్రి భువ‌న‌గిరి : కోడి పందాలు నిర్వ‌హిస్తున్న ఐదుగురు వ్య‌క్తుల‌ను పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ఒక‌రు ఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్‌. ఈ ఘ‌ట‌న యాదాద్రి భువ‌న‌గిరి జిల్లా బీబీన‌గ‌ర్ మండ‌లం చిన్న ప‌లుగు తాండ‌లో గురువారం చోటుచేసుకుంది. నిందితులను యాపాల మ‌ధుసూద‌న్‌, మ‌ర్రి మ‌హేశ్‌, మామిళ్ల‌ప‌ల్లి శ్రీ‌ధ‌ర్‌(ఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్‌), బానోతు బంధు, బిజిలి రాంబాబుగా గుర్తించారు. భువ‌న‌గిరి డీసీపీ నారాయ‌ణ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. నిందితులంతా కోళ్ల పందాల‌కు బానిస‌ల‌య్యార‌న్నారు.

విజ‌య‌వాడ నుంచి పందెపు కోళ్ల‌ను కొనుగోలు చేసి స్థానికంగా ఉన్న పంట పొలాల్లో చిన్న గ్రౌండ్‌ను త‌యారు చేసుకుని కోడి పందాలను నిర్వ‌హిస్తున్నార‌న్నారు. ప్ర‌తీ ఒక్క వ్య‌క్తి నుంచి బెట్టింగ్ కోసం రూ. 500 వ‌సూలు చేస్తున్న‌ట్లు తెలిపారు. సంఘ‌ట‌నా స్థ‌లం నుంచి రూ. 15 వేల‌ను స్వాధీనం చేసుకున్న‌ట్లు తెలిపారు. టీఎస్ గ్యాంబ్లింగ్ యాక్ట్‌-1974, ప్రివెన్ష‌న్ ఆఫ్ క్రూయాల్టీ టు యాక్ట్‌-1960 కింద నిందితుల‌పై కేసులు న‌మోదు చేసిన‌ట్లు చెప్పారు.


logo