శనివారం 16 జనవరి 2021
Crime - Dec 29, 2020 , 17:14:55

పోలీసుల్లా వచ్చారు.. దర్జాగా దోచుకెళ్లారు..

పోలీసుల్లా వచ్చారు.. దర్జాగా దోచుకెళ్లారు..

మీరట్: క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులమని చెప్పి దర్జాగా వచ్చారు. ఇంట్లో దాక్కున్న ఓ వ్యక్తి కోసం వచ్చామంటూ నమ్మబలికి ఇంట్లోని అందర్నీ కట్టేసి నిలువుదోపిడీకి పాల్పడ్డారు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని మీరట్ జిల్లాలో జరిగింది. దోపిడీ సంఘటనలో కనీసం అరడజను మంది దొంగలు పాల్గొన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. శాస్త్రి నగర్ ప్రాంతంలోని ఆభరణాల తయారీదారుడి ఇంటి నుంచి రూ.11 లక్షల నగదు, బంగారంతో ఉడాయించారు.  

మీరట్‌ జిల్లాలోని శాస్త్రినగర్‌లో నివసించే ఆభరణాల తయారీదారు తేజ్‌పాల్‌ వర్మ ఇంటికి కొందరు వ్యక్తులు తెల్లవారు జామునే వచ్చారు. ఘజియాబాద్ క్రైమ్ బ్రాంచ్‌కు చెందిన పోలీసులమని పరిచయం చేసుకున్నారు. మేం ఎంతో కాలంగా వెతుకుతున్న ఓ వ్యక్తి ఈ ఇంట్లో దాక్కున్నట్లు తమకు సమాచారం అందిందని, ఆయనను పట్టుకోవడానికి ఇంట్లో తనిఖీ చేస్తామంటూ మాటల్లో దించారు. అలాంటి వారు ఎవరూ లేరని చెప్తున్నా వినకుండా ఇంట్లోకి వచ్చిన వారు.. కుటుంబ సభ్యులను ఒక గదిలో నిర్బంధించారు. అనంతరం ఇంట్లో ఉన్న నగదు, ఆభరణాల కోసం ఇంటిని మొత్తాన్ని వెతికారు. బెడ్‌ బాక్స్‌లో ఉంచిన 500 గ్రాముల బంగారం, రూ.11 లక్షల నగదును ఎత్తుకెళ్లిపోయారు. దొంగలు ఆ ఇంట్లో మూడు గంటల పాటు ఉండి చాలా నెమ్మదిగా తమ పనికానిచ్చారు. పోలీసులమని చెప్పిన వారిలో కొందరు ముసుగులు కూడా ధరించారని, చలి కారణంగా ముఖాలకు ముసుగులు వేసుకున్నట్లు చెప్పారని, వారందరూ హర్యన్వి మాండలికంలో మాట్లాడినట్లు ఇంటి యాజమాని తేజ్‌పాల్‌ వర్మ తెలిపారు. వారిలో ఒకరిని స్థానికంగా ఉన్నట్లు అనుమానిస్తున్నట్లు చెప్పారు. టెర్రస్ నుంచి ఇంట్లోకి ప్రవేశించిన దొంగలు.. గదిలోకి ప్రవేశించగానే తలపై పిస్టల్ చూపించారని తెలిపారు. దొంగలు పారిపోయిన తర్వాత పొరుగువారి సాయంతో బయటకు వచ్చిన తేజ్‌పాల్‌ వర్మ కుటుంబీకులు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. క్రైమ్ బ్రాంచ్‌ పోలీసులమంటూ దర్జాగా దొంగలు ఇంట్లోకి ప్రవేశించడం పట్ల పోలీసులు విస్మయం ప్రకటిస్తున్నారు. దొంగలు అని అనుమానం రాగానే వెంటనే పక్కింటివారిని అలర్ట్‌ చేయడం ద్వారా దొంగలను పట్టుకోవచ్చని పోలీసులు చెప్తున్నారు.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.