గురువారం 24 సెప్టెంబర్ 2020
Crime - Aug 25, 2020 , 17:50:35

ఆరు నెలల చిన్నారి తలపై గన్‌ పెట్టి.. తల్లిపై గ్యాంగ్‌ రేప్‌

ఆరు నెలల చిన్నారి తలపై గన్‌ పెట్టి.. తల్లిపై గ్యాంగ్‌ రేప్‌

ముజాఫర్‌పూర్‌ : కామంతో కండ్లు మూసుకుపోయిన మృగాళ్లు.. తమ కోరికను తీర్చుకోవడానికి ఎంతటి దారుణానికైనా వెనుకాడడం లేదు. ఒంటరిగా నివసిస్తున్న ఓ బాలింత ఇంట్లోకి ఐదుగురు దుండగులు ప్రవేశించి తన ఆరు నెలల చిన్నారిపై గన్‌ పెట్టి.. చంపేస్తామని బెదిరిస్తూ ఒకరి తరువాత ఒకరు లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘాతుకాన్ని వీడియో తీసి సోషల్‌మీడియాలో పోస్టు చేశారు. బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లోని కర్జా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఓ గ్రామంలో ఆగస్టు 12న ఈ అమానవీయ ఘటన చోటు చేసుకోగా.. వీడియో వైరల్‌ అయిన తరువాత వెలుగులోకి వచ్చింది. 

వివరాలు.. కర్జా సమీపంలోని గ్రామంలో ఓ మహిళ, తన భర్తతో కలిసి నివాసం ఉండేది. ఆమె భర్త వృత్తి రిత్యా ఇతర ప్రాంతాలకు వెళ్తుంటాడు. దీంతో తన 6 నెలల కుమారుడితో మహిళ ఒంటరిగా నివసిస్తోంది. ఆగస్టు 12న రాత్రి అదే గ్రామానికి చెందిన చుంచున్ కుమార్, లాల్బాబు కుమార్, సజన్ కుమార్, శ్రీరామ్ కుమార్, శివ కుమార్ అనే 19 నుంచి 21 ఏండ్ల మధ్య వయస్సున్న యువకులు ఆమె ఇంట్లోకి ప్రవేశించారు. వెంటనే మహిళ కేకలు పెట్టి, ప్రతిఘటించే ప్రయత్నం చేస్తుండగా.. చుంచున్‌కుమార్‌ ఆమె 6 నెలల కుమారుడిని చేతుల్లోకి తీసుకొని తలపై పిస్టోల్‌ పెట్టి చంపేస్తానని బెదిరించి.. ఒకరి తరువాత ఒకరు ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ విషయాన్ని బయటికి చెబితే తల్లీకొడుకులను చంపేస్తామని బెదిరింపులకు పాల్పడ్డారు. 

తరువాత బాధితురాలు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయగా ఈ ఘటనను ఎస్‌డీపీఓ రాజేశ్‌శర్మ తీవ్రంగా పరిగణించి కఠిన చర్యలు తీసుకోవాలని కర్జా పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. ఈఘటనలో ఐదుగురిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి, బాధితురాలికి వైద్య పరీక్షలు చేయించి మహిళా పోలీసుల పర్యవేక్షణలో ఇంటికి పంపించారు.

ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌ కావడంతో స్థానికంగా సంచలనంగా మారింది. వీలైనంత త్వరగా నిందితులను అరెస్టు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ వీడియోను వైరల్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని పలు సామాజిక సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo