సోమవారం 28 సెప్టెంబర్ 2020
Crime - Jul 12, 2020 , 12:42:51

15 ఏళ్ల బాలిక గ‌ర్భిణి.. ర‌హ‌స్యంగా చంపేసి పూడ్చిపెట్టారు

15 ఏళ్ల బాలిక గ‌ర్భిణి.. ర‌హ‌స్యంగా చంపేసి పూడ్చిపెట్టారు

డెహ్రాడూన్ : ఓ 15 ఏళ్ల బాలిక‌ను గుర్తు తెలియ‌ని వ్య‌క్తి లొంగ‌దీసుకున్నాడు. బాధితురాలు గర్భం దాల్చింది. క‌డుపులో నొప్పిగా ఉంద‌ని ఆస్ప‌త్రికెళ్తే.. ఐదు నెల‌ల గ‌ర్భిణి అని తేలింది. దీంతో నాన‌మ్మ స‌హ‌కారంతో తండ్రి ఆ బాలిక‌ను ర‌హ‌స్యంగా చంపేసి పూడ్చి పెట్టారు. ఈ అమానుష ఘ‌ట‌న ఉత్త‌రాఖండ్ లోని బ‌గేశ్వ‌ర్ జిల్లాలో బుధ‌వారం చోటు చేసుకోగాల ఆల‌స్యంగా వెలుగు చూసింది. 

ప‌దో త‌ర‌గ‌తి చదువుతున్న ఓ 15 ఏళ్ల బాలిక త‌న నాన‌మ్మ‌తో ఉంటుంది. ఆమె త‌ల్లిదండ్రులిద్ద‌రూ వేర్వేరు గ్రామాల్లో ఉంటున్నారు. కొద్దికాలం క్రితం ఆ బాలిక‌ను ఓ వ్య‌క్తి లొంగ‌దీసుకున్నాడు. అయితే ఆమెకు ఇటీవ‌లే క‌డుపులో నొప్పి రావ‌డంతో.. నాన‌మ్మ మంగ‌ళ‌వారం ఆస్ప‌త్రికి తీసుకెళ్లింది. వైద్యులు టెస్టులు చేయ‌గా ఐదు నెల‌ల గ‌ర్భిణి అని తేలింది.

చేసేదేమీ లేక బాలిక‌ను ఇంటికి తీసుకువ‌చ్చింది నాన‌మ్మ‌. ఈ విష‌యాన్ని ఆమె తండ్రికి తెలియ‌జేసింది. ఆగ్ర‌హానికి లోనైన తండ్రి.. త‌న కుమార్తెను తీవ్రంగా చిత‌క‌బాది చంపేశాడు. ఆ త‌ర్వాత ఎవ‌రికీ తెలియ‌కుండా పూడ్చి పెట్టాడు. 

ఈ విష‌యం మ‌రో గ్రామంలో ఉంటున్న ఆమె త‌ల్లికి తెలిసింది. దీంతో త‌న కుమార్తె హ‌త్య‌పై పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. గురువారం ఆ శ‌వాన్ని బ‌య‌ట‌కు తీసి పోస్టుమార్టంకు త‌ర‌లించారు. అయితే బాలిక ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ద‌ని తండ్రి, నాన‌మ్మ పోలీసుల ఎదుట న‌మ్మ‌బ‌లికారు. కానీ ఆమె హ‌త్య‌కు గురైంద‌ని పోలీసులు విచార‌ణ‌లో తేలింది. 


logo