శుక్రవారం 15 జనవరి 2021
Crime - Sep 29, 2020 , 18:39:46

చోరీకి గురైన మందులను స్వాధీనం చేసుకున్న పోలీసులు

చోరీకి గురైన మందులను స్వాధీనం చేసుకున్న పోలీసులు

ఖమ్మం : జిల్లా లోని కొణిజర్ల మండల కేంద్రంలో చోరీకి గురైన రూ. 30 లక్షల విలువైన మెడిసిన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 15వ తేదీన హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్తున్న కంటైనర్ ప్రమాదానికి గురైంది. హైదరాబాద్ నుంచి మధిర వెళ్తున్న ఆర్టీసీ బస్ కంటైనర్ ను ఢీకొట్టడంతో అందులోని మందులతో సహా కంటైనర్ రోడ్డు పక్కన పడిపోయింది. దీంతో డ్రైవర్ ఆ రాత్రి లారీ వద్ద ఉండి తెల్లవారి ఉదయం టిఫిన్ చేసేందుకు సమీపంలోని హోటల్ కి వెళ్లాడు.

తిరిగి అతను వచ్చి చూసే సరికి 5 బాక్సులు అపహరణకు గురైనట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో దర్యాప్తు నిర్వహించిన పోలీసులు రఘునాధపాలెం మండలం వెంకటాయపాలెం గ్రామానికి చెందిన ఐదుగురు వ్యక్తులు చోరీకి పాల్పడ్డట్లు గుర్తించారు. మంగళవారం వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మెడిసిన్ విశాఖపట్నంలోని ఓ పేరు మోసిన కంపెనీకి చెందినదిగా పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.