సోమవారం 25 మే 2020
Crime - Mar 29, 2020 , 06:05:07

ఆమెను చంపింది ఒక్కడే...?

ఆమెను చంపింది ఒక్కడే...?

హైదరాబాద్ : చేవెళ్ల తంగిడిపల్లి బ్రిడ్జి వద్ద వెలుగు చూసిన గుర్తు తెలియని మహిళ హత్య కేసు మిస్టరీని సైబరాబాద్‌ పోలీసులు దాదాపుగా ఓ కొలిక్కి తీసుకుని వచ్చే పనిలో పడ్డారు. కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు తంగిడిపల్లి బ్రిడ్జి వద్ద రెండు, ఎన్‌కేపల్లి వద్ద రెండు సీసీ కెమెరాలను పరిశీలించారు. తంగిడిపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి  ఆ రోజు రాత్రి దావతుకు వెళ్లివస్తుంటే ఓ కారు ఆగిందని మొదటి క్లూ ఇచ్చారు. దీని ఆధారంగా పోలీసులు వ్యక్తి చూసిన సమయానికి అంతకంటే ముందు....దాని తర్వాత సమయాన్ని క్రోడీకరించుకుని కారు మూమెంట్‌ను విశ్లేషించారు. ఇలా 20 కిలో మీటర్ల చదరపు దూరాన్ని సంఘటన వెలుగు చూసిన పరిసర ప్రాంతాల్లో జల్లెడ పట్టారు. అప్పుడు ఓ కెమెరాలో అనుమానించిన కారుపై డ్రైవ్‌ ఈజీ  అని రాసి ఉంది. దీని ఆధారంగా అనుమానితుడు డ్రైవ్‌ ఈజీ ద్వారా కారును సెల్ఫ్‌ డ్రైవ్‌ తీసుకుని ఈ హత్యకు పాల్పడినట్లు నిర్ధారించుకున్నారు. డ్రైవ్‌ ఈజీ సంస్థ దగ్గర కారును అద్దెకు తీసుకున్నప్పుడు పెట్టిన ధ్రువీకరణ పత్రాలు, ఫోన్‌ నంబర్లను పరిశీలించారు. అంతే అనుమానితుడి ఎవరో పోలీసులకు తెలిసిపోయింది. 

పరిచయమే ప్రాణం తీసిందా?

పోలీసులకు దొరికిన ప్రాథమిక ఆధారాల్లో మృతురాలు సిక్కిం నుంచి వచ్చి ముంబైలో కొద్ది రోజుల ఉన్నట్లు తెలిసింది. ఆ తర్వాత అక్కడి నుంచి హైదరాబాద్‌ వచ్చి సైబరాబాద్‌ పరిధిలోనే పేయింగ్‌ గెస్టు గదిలో ఉన్నట్లు తెలిసింది.అయితే ఆమెకు పరిచయం ఉన్న వ్యక్తి ఇటీవల హైదరాబాద్‌ వచ్చి మహిళతో తిరిగినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే మహిళతో గొడవ పడి ఆ తర్వాత వాగ్వాదం పెరిగి అతను సదరు మహిళను హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. హత్య తర్వాత మృతదేహాన్ని తరలించిన కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది.సిక్కింలో నమోదైన మిస్సింగ్‌  కేసుల వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. ఇంకా పూర్తి కారణాల ఏమైనా ఉన్నాయా...చంపాల్సిన అంశం ఏమై ఉంటుంది...మహిళను  ఎక్కడ...ఎన్ని గంటలకు....చంపాడు...మృతదేహాన్ని తరలించేందుకు ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. లాక్‌డౌన్‌ పూర్తైన తర్వాత పూర్తి వివరాలు పోలీసులు మీడియాకు తెలిపే అవకాశం ఉంది.   logo