సోమవారం 25 మే 2020
Crime - Mar 18, 2020 , 09:16:18

ఇంటి యజమానురాలిపై కోపం..బాలుడు కిడ్నాప్‌

ఇంటి యజమానురాలిపై కోపం..బాలుడు కిడ్నాప్‌

చందానగర్: అద్దెకు ఇచ్చిన ఇంటి యజమానురాలిపై కోపంతో ఆమె కొడుకును కిడ్నాప్‌ చేశాడు. ఫిర్యాదు అందిన నాలుగు గంటల్లోనే పోలీసులు నిందితుడిని అరెస్ట్‌ చేసి.. బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించారు. బాలుడిని పట్టుకోవడంలో స్థానికులు కూడా సహకరించారు. ఈ సంఘటన మియాపూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకున్నది.  మంగళవారం పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ కృష్ణప్రసాద్‌, ఇన్‌స్పెక్టర్‌ వెంకటేశ్‌, ఎస్‌ఐలు రఘురాం, రవికిరణ్‌తో కలిసి వివరాలు వెల్లడించారు. విశాఖపట్నం జిల్లా గుల్‌గొండ మండలం, నాగపురం గ్రామానికి చెందిన పులేజి నూకరాజు అలియాస్‌ శివ(30) బతుకు దెరువు కోసం నగరానికి వలస వచ్చి.. మాదాపూర్‌ లేబర్‌ అడ్డాలో నివాసం ఉండేవాడు. స్థానికంగా అడ్డాకూలీగా పనిచేశాడు. 

ఇతనికి గతంలో పెండ్లి కాగా ఇద్దరు పిల్లలు. అయితే  మొదటి భార్యతో వేరుగా ఉంటూ..రేణుకను రెండో పెండ్లి చేసుకుని.. ఆరు నెలల క్రితం న్యూ హఫీజ్‌పేట్‌ ఆదిత్యానగర్‌లోని ఫర్హీన్‌ సుల్తాన ఇంట్లో కాపురం పెట్టాడు. కాగా.. శివకు హెచ్‌ఐవీ ఉన్న విషయం తెలుసుకున్న రేణుక అతన్ని వదిలి వెళ్లిపోయింది. దీంతో ఇల్లు ఖాళీ చేయడానికి శివ యత్నించగా.. అద్దె డబ్బులు ఇచ్చేవరకు ఖాళీ చేసేదిలేదని యజమానురాలు చెప్పింది. దీంతో ఆమెపై కక్ష పెం చుకున్నాడు. ఈ క్రమంలో తాగుడు బానిసైన శివకు.. పనిదొరకక.. డబ్బులు లేకపోవడంతో ఫర్హాన్‌ కుమారుడు మహ్మద్‌ అష్కన్‌(2)ను కిడ్నాప్‌ చేసి అమ్ముకోవాలనుకున్నాడు. ఇందులో భాగంగా సోమవారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఫర్హాన్‌ పనిలో.. ఆమె కొడుకు అష్కన్‌ను శివ కిడ్నాప్‌ చేశాడు.

కల్లు దుకాణంలో పట్టివేత...

కొడుకు అష్కన్‌ కనపడకపోవడంతో తల్లి ఫర్హాన్‌ స్థానికంగా గాలిస్తుంది. ఇందుకు స్థానికు లు కూడా ఆమెకు సహకరించారు. స్థానికంగా ఉన్న సీసీ ఫుటేజీలను పరిశీలించగా.. ఓ వ్యక్తి అష్కన్‌ను తీసుకెళ్లడం గుర్తించారు. వెంటనే మియాపూర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టి బాలుడి కోసం గాలిస్తున్నారు. అలాగే  ఆదిత్యానగర్‌ బస్తీకి చెందిన శిమోన్‌, ఏలియాతో పాటు యువకులు 10 బృందాలుగా ఏర్పడి లేబర్‌అడ్డాలు, వైన్స్‌లు, కల్లుదుకాణాలు, బస్‌స్టేషన్‌లు, రైల్వేస్టేషన్లు తదితర ప్రాంతాల్లో గాలించారు. 

ఇదే సమయంలో శివ..కొండాపూర్‌లోని బావ ఐన చేతగాని రాజు వద్దకు వెళ్లి డబ్బులు అడిగాడు. అతని వద్ద  బాలుడు ఉండగా.. అతను ఎవరని శివను ప్రశ్నిచంగా  సమాధానం ఇవ్వలేదు. దీంతో పోలీసులకు చెబుతానని హెచ్చరించగా.. శివ అక్కడి నుంచి పారిపోయాడు. దర్యాప్తులో భాగంగా పోలీసులు సాయంత్రం 6 గంటలకు శివ మాదాపూర్‌ కల్లు దుకాణంలో ఉన్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అతన్ని అరెస్ట్‌చేసి రిమాండ్‌కు తరలించారు. బాలుడిని తల్లికి అప్పగించారు. ఫిర్యాదు అందిన నాలుగు గంటల్లోనే బాలు డి గుర్తించి పట్టుకోవడంలో చొరవచూపిన స్థానిక యువకులను, ఆదిత్యానగర్‌ బస్తీ నాయకులను ఏసీపీ కృష్ణప్రాసాద్‌, ఇన్‌స్పెక్టర్‌  అభినందించారు.


logo