తల్లికి సాయం చేసేందుకు.. అత్తవారింటికి కన్నం వేసిన కోడలు

Nov 27, 2020 , 13:33:10

హైదరాబాద్‌ : నగరంలోని యాప్రాల్‌ కింది బస్తీలో ఈ నెల 23న జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. అప్పుల పాలైన తల్లికి సహాయం చేసేందుకే కోడలు అత్తింటికే కన్నం వేసింది. ఈ విషయం పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చింది. ఘటన వివరాలను సీసీ మహేశ్‌ భగవత్‌ మీడియాకు వివరించారు. యాప్రాల్‌ కింది బస్తీకి చెందిన ఓ కుటుంబం ఈ నెలలో బంధువుల ఇంట్లో వివాహ వేడుకకు వెళ్లారు. తిరిగి వచ్చే సరికి ఇంట్లోని స్టోర్‌ రూంలో సామగ్రి కిందపడేసి ఉండడంతో పాటు అల్మారా పగులగొట్టి ఉంది. 44 తులాల బంగారం, వెండితో పాటు పదివేల వరకు నగదుకు ఎత్తుకు వెళ్లారు. వెంటనే స్థానిక జవహర్‌నగర్‌ పోలీసులకు సమాచారం అందించగా.. సీసీఎల్‌ మల్కాజ్‌గిరి, ఐటీసెల్‌ పోలీసులతో కలిసి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇంట్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. ఇందులో ఒంటినిండా నల్లటి దుస్తులు కప్పుకొని వచ్చిన వ్యక్తిని గుర్తించారు. సదరు వ్యక్తిపై అనుమానం వచ్చి మరిన్ని సీసీటీవీల ఫుటేజీలను పరిశీలించగా.. దొంగతనం చేసింది ఆడ వ్యక్తిగా తేల్చారు. ఈ మేరకు విచారణ జరపగా.. ఇంటి యజమాని కోడలే తన తల్లితో కలిసి దొంగతనం చేసినట్లు తెలిసింది. ఇంటికి పెద్ద కోడలైన సోని, తల్లి లీలావతి మాటలు విని దొంగతనానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. సోని 2016లో ఇంటి యజమాని కొడుకు విశ్వనాథ్‌ను లవ్‌ మ్యారేజ్‌ చేసుకుందని చెప్పారు. నిందితులు ఇద్దరి నుంచి 44 తులాల బంగారం, 15 తులాల వెండి, రూ.10,500 నగదు రికవరీ చేసినట్లు తెలిపారు. నిందితులు వాసగోని సోని, నేమూరి లీలావతిపై కేసు నమోదు చేసినట్లు సీసీ వివరించారు.

తాజావార్తలు

ట్రెండింగ్

THE CONTENTS OF THIS SITE ARE © 2020 TELENGANA PUBLICATIONS PVT. LTD