సోమవారం 30 నవంబర్ 2020
Crime - Oct 31, 2020 , 05:24:37

నమ్మివచ్చిన ప్రేయసిపై కత్తిదూసిన ప్రియుడు

నమ్మివచ్చిన ప్రేయసిపై కత్తిదూసిన ప్రియుడు

ఇల్లెందు : ప్రేమిస్తున్నానని నమ్మబలికాడు. అయినా ఆమె నమ్మలేదు.. నెలల తరబడి వెంబడించాడు. ఆదర్శ వివాహమని, కొత్త బంగారు లోకమంటూ కథలు చెప్పాడు. తీరా ఆమె ప్రేమను ఒప్పుకున్న తర్వాత.. తన దేహాన్ని కోరుకున్నాడు. ఏడాదిపాటు కలిసి తిరిగారు. విషయం ఇంట తెలిసి.. రచ్చరచ్చ కావడంతో ముఖం చాటేసే ప్రయత్నం చేశాడు. పెండ్లి చేసుకోమన్నందుకు ఆమె ప్రాణాలనే బలికోరాడు. ఊరు నిద్రపోతున్నవేళ వాగు దగ్గరకు రమ్మన్నాడు. నమ్మి వచ్చిన ప్రేయసిపై కత్తిదూశాడా ప్రియుడు. ఒక్కటి కాదు రెండు కాదు.. ఐదారు చోట్ల కత్తితో పొడిచాడు. ప్రియుడే సర్వస్వమని నమ్మిన ఆ యువతి రక్తపు మడుగులో.. ప్రాణాలు నిలబెట్టుకునేందుకు మృత్యువుతో పోరాడుతున్నది. ఈ విషాద సంఘటన ఇల్లెందులోని సత్యనారాయణపురంలో రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు పోలీసుల కథనం ప్రకారం.. ఇల్లెందు పట్టణం ఒకటో వార్డుకు చెందిన జక్కుల సందీప్‌, బద్రి సౌజన్యలు ఏడాది కాలంగా ప్రేమించుకుంటున్నారు. మొదట సౌజన్య నిరాకరించినప్పటికీ సందీప్‌ వెంటపడి ప్రేమిస్తున్నానంటూ నమ్మబలకడంతో అతని ప్రేమను ఒప్పుకున్నది. వీరి ప్రేమ వ్యవహారం పెద్దలకు తెలియడంతో సౌజన్య కుటుంబసభ్యులు ఆమెను నిలదీశారు.

అప్పటినుంచి పెళ్లి చేసుకుందామంటూ సందీప్‌ వెంటపడింది సౌజన్య. చేసుకుంటానని నమ్మిస్తూనే కాలం వెల్లదీశాడు సందీప్‌. రోజురోజుకూ పెండ్లి పేరుతో సౌజన్య ఒత్తిడి పెరగడంతో పక్కా ప్రణాళికతో ఆమె అడ్డు తొలిగించుకోవాలని నిర్ణయించుకున్నాడు. గురువారం రాత్రి పదకొండు గంటల తరువాత సత్యనారాయణపురం పక్కన వాగు వద్దకు పెండ్లి గురించి మాట్లాడేందుకు సౌజన్యను రమ్మన్నాడు సందీప్‌. అతని మాటలు విని రాత్రి ఒంటరిగా వాగు వద్దకు చేరుకోగానే.. ఒక్కసారిగే ఆమెపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఐదారు చోట్ల కత్తితో పొడిచాడు. ఆమె కేకలు విన్న కొందరు బాటసారులు.. వారిద్దరి పెనుగులాటను చూసి పోలీసులకు సమాచారం అందించారు. ఈ క్రమంలో సౌజన్య తీవ్ర రక్తస్రావంతో అపస్మారక స్థితిలోకి వెళ్లింది. వెంటనే సీఐ రమేష్‌ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొగానే రక్తపు మరకలతోనే సందీప్‌ తారసపడ్డాడు. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా సౌజన్యపై కత్తితో దాడి చేశానని ఒప్పుకున్నాడు. పోలీసులు సౌజన్యను ఇల్లెందు ప్రభుత్వాసుపత్రికి తరలించగా.. వారు మెరుగైన వైద్యం కోసం ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి పంపించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు రాబట్టేందుకు సీఐ రమేష్‌ విచారణ చేపట్టారు. ఈ హఠాత్పరిణామం సత్యనారాయణపురంలో విషాదఛాయలు అలుముకున్నాయి. 

విషమంగానే సౌజన్య ఆరోగ్యం 

మయూరిసెంటర్‌ : ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సౌజన్య ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, ఆమెను ఐసీయూలో ఉంచి వైద్యసేవలందిస్తున్నారని సూపరింటెండెంట్‌ డాక్టర్‌ బి.వెంకటేశ్వర్లు  తెలిపారు. ఆమెకు ఎక్కువ గాయాలున్నాయని, యువతి ఆరోగ్య పరిస్థితి కొంత విషమంగా ఉన్నప్పటికీ మెరుగైన వైద్యం అందిస్తున్నామన్నారు.