ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Crime - Jun 17, 2020 , 16:25:15

ప్రార్థన హాలు బిల్లు కోసం దొంగగా మారిన పాస్టర్‌

ప్రార్థన హాలు బిల్లు కోసం దొంగగా మారిన పాస్టర్‌

చెన్నై: కరోనా వైరస్‌ వ్యాప్తి కారణంగా గత కొంత కాలంగా భక్తులెవరూ ప్రార్థనలు రాకపోవడంతో పాస్టర్‌ కాస్తా బైకు దొంగగా మారాడు. పాపం ఆయన కోసం కాదంట.. ప్రార్థన హాలు కిరాయి చెల్లించేందుకేనంట. ఈ పాస్టర్‌ దొంగ ప్రస్తుతం తమిళనాడులోని సుబ్రహ్మణ్యపురం  పోలీసుల అదుపులో ఉన్నాడు. 

తమిళనాడు మధురై శివారులో క్రిస్టియన్‌ బ్రదర్స్‌ అసెంబ్లీ  ఉంది. థేనీకి చెందిన విజయన్‌ సామ్యూల్‌ దీనికి పాస్టర్‌గా కొనసాగుతున్నారు. గత రెండేండ్లుగా ఈయన ఆధ్వర్యంలో చర్చిలో ప్రార్థనలు జరుగుతున్నాయి. ఒకవైపు లాక్‌డౌన్‌ విధింపుతో భక్తులు రాక తగ్గిపోవడం.. మరోవైపు ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాడు. గత కొంత కాలంగా ప్రార్థనలు చేసే హాలుకు కిరాయి కూడా చెల్లించలేని పరిస్థితిలో ఉన్నాడు. హాలు యజమాని కిరాయి చెల్లించాలని ఒత్తిడి తెస్తుండటంతో ఏం చేయాలో పాలుపోని పాస్టర్‌ విజయన్‌ సామ్యూల్‌.. బైకుల దొంగతనం చేయడానికి పూనుకొన్నాడు. ముఖ్యంగా మహిళలు నడిపే బైకులను టార్గెట్‌ చేసుకొని సుబ్రహ్మణ్యపురం, ఎస్‌ఎస్‌ కాలనీ, తిరుమంగళం ప్రాంతాల్లోని బిజీ ప్రాంతాల్లో బైకులు పార్కింగ్‌ చేసి వెళ్లే మహిళలను గమనిస్తూ.. వారి బైకులను ఎత్తుకెళ్లడం  ప్రారంభించాడు. 

మూడు వాహనాలను కుంభంలోని తన కుటుంబసభ్యులకు ఇవ్వగా మరో రెండింటిని తన వద్దకు వచ్చే వారికి విక్రయించాడు. గత ఆరు నెలలుగా బైకులు దొంగతనాలకు గురవుతుండటంతో పోలీసులు ప్రత్యేక దృష్టిసారించారు. ఇటీవల ఇలాగే ఒక బైకును దొంగిలించి చిన్న రిపేర్‌ కోసం  మెకానిక్‌ వద్దకు వెళ్లగా సదరు బైకు యజమాని తన బైకును గుర్తించి సుబ్రహ్మణ్యపురం పోలీసులకు సమాచారం అందించాడు. దాంతో పాస్టర్‌ బైకు దొంగతనం బట్టబయలైంది. ఈ పాస్టర్‌ దొంగిలించే వాహనాలను తీసుకొంటున్న తిరుపక్కరన్‌కుంద్రకు చెందిన సెల్వమ్‌ అనే సెకండ్‌ హ్యండ్‌ బైకులు విక్రయించే వ్యాపారిని కూడా పోలీసులు అరెస్ట్‌ చేశారు. 


logo