బెంగళూరు: ఒక దొంగ పదునైన కత్తితో ఒక వ్యక్తిని బెదిరించి దోచుకోబోయాడు. ఆ వ్యక్తి సహాయం కోసం కేకలు వేయడంతో దారిన పోయే వాళ్లు స్పందించారు. ధైర్యం చేసి ఆ దొంగను అడ్డుకుని చితకబాదారు. అయితే పోలీసులకు అప్పగించేలోపు అతడు పారిపోయాడు. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ ఘటన జరిగింది.
పదునైన కత్తిని చేతిలో పట్టుకున్న ఒక దొంగ క్యాబ్ డ్రైవర్‌ను బెదిరించి డబ్బులు ఇమ్మని అడిగాడు. షాకైన క్యాబ్ డ్రైవర్ కేకలు వేయడంతో సమీపంలోని కొందరు అతడికి సహాయం చేసేందుకు ముందుకు వచ్చారు. దొంగ చేతిలో కత్తి ఉన్నప్పటికీ బెదరక కొందరు అతడ్ని అడ్డుకున్నారు. కత్తి ఉన్న అతడి చేతిని పట్టుకున్నారు. ఈ క్రమంలో కొంత పెనుగులాట జరిగింది.
మరి కొందరు కర్రలతో ఆ దొంగను కొట్టారు. అనంతరం పోలీసులకు ఫోన్ చేశారు. పోలీసులు అక్కడకు రాగా పట్టు విడిపించుకుని దొంగ పారిపోయాడు. మరోవైపు ఇదంతా అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. దీంతో సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించి నిందితుడ్ని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.