శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Crime - Aug 03, 2020 , 20:06:10

‘పంగోలిన్‌' పొలుసు ముఠా గుట్టురట్టు

‘పంగోలిన్‌' పొలుసు ముఠా గుట్టురట్టు

భద్రాద్రి కొత్తగూడెం : గిరిజనులకు డబ్బు ఆశ చూపి పంగోలిన్‌ (అలుగు) చర్మాలను (పొలుసు) సేకరిస్తున్న ముఠా ఆటకట్టించారు తెలంగాణ, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అటవీశాఖ పోలీసులు. తామే కొనుగోలుదారుల అవతారమెత్తారు. అండర్‌ కవర్‌ ఆపరేషన్‌ చేసి 12 మంది అంతర్రాష్ట్ర ముఠాను అదుపులోకి తీసుకున్నారు. ఘటనకు సంబంధించిన వివరాలను సోమవారం కిన్నెరసాని వైల్డ్‌లైఫ్‌ ఎఫ్‌డీవోలు దామోదర్‌రెడ్డి, కొత్తగూడెం ఎఫ్‌డీవో అబ్బయ్య వివరాలు వెల్లడించారు. భద్రాచలం అటవీ ప్రాంతంలో గిరిజనులకు ఓ ముఠా డబ్బు ఆశ చూపి పంగోలిన్‌ చర్మాలను సేకరిస్తుందని, వారిని పట్టుకునే చర్యల్లో భాగంగా 

కొత్తగూడెం అటవీశాఖ అధికారులు ఇటీవల బాదవత్‌ రవి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించామన్నారు. రవి ఇచ్చిన సమాచారంతో మూడు రోజుల పాటు హైదరాబాద్‌తో సహా ఇతర ప్రాంతాల్లో నిఘా పెట్టి సునీల్‌, నాగరాజుతో పాటు మరో తొమ్మిది మందిని అదుపులోని తీసుకున్నామన్నారు. వన్యప్రాణుల సంరక్షణ చట్టాల ప్రకారం వీరిపై కేసులు నమోదు చేశామన్నారు. ఈ ముఠాలో మరో ముగ్గురు పరారీలో ఉన్నారన్నారు.

పట్టుబడిన 12 మంది నుంచి నాలుగు కిలోల పొలుసులను స్వాధీనం చేసుకున్నామన్నారు. పోలీసుల సహకారంతో కొత్తగూడెం మెజిస్ట్రేట్‌ ముందు నిందితులను ప్రవేశపెట్టామన్నారు. గిరిజనులు, వన్యప్రాణుల జోలికి వెళ్తే కఠినమైన చట్టాలు అమలులో ఉన్నాయని, ఎంతటివారైనా ఉపేక్షించలేదని ఎఫ్‌డీవోలు హెచ్చరించారు.


logo