శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Crime - Sep 12, 2020 , 17:19:07

టీవీ నటి శ్రావణి ఆత్మహత్య కేసులో కొనసాగుతున్న దర్యాప్తు

టీవీ నటి శ్రావణి ఆత్మహత్య కేసులో కొనసాగుతున్న దర్యాప్తు

హైదరాబాద్‌ : టీవీ నటి కొండపల్లి శ్రావణి ఆత్మహత్య కేసులో హైదరాబాద్‌ ఎస్సార్‌నగర్‌ పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. కేసులు ఆరోపణలు ఎదుర్కొంటున్న దేవరాజు రెడ్డి పోలీసులు శనివారం మూడో రోజు విచారిస్తున్నారు. మరో అనుమానితుడైన సాయికృష్ణారెడ్డి పోలీసుల ఎదుట విచారణకు రావాల్సి ఉంది. ఈ సందర్భంగా దేవరాజు పోలీసులకు పలు ఆడియోలు, వీడియో క్లిపింగ్స్‌ను సైతం పోలీసులకు అందజేసినట్లు తెలుస్తోంది. అతను తెలిపిన వివరాలు మేరకు పోలీసులు సాయికృష్ణారెడ్డిని విచారించే అవకాశం ఉంది. శుక్రవారం పోలీసులు విచారణకు హాజరు కావాలని సూచించారు. కాగా, అతను శ్రావణి కుటుంబ సభ్యులతో గొల్లప్రోలులోనే ఉన్నానని, తర్వాత హాజరవుతానని పోలీసులకు సమాచారం అందించినట్లు తెలుస్తోంది. అయితే ఇవాళ విచారణకు హాజరు కావాల్సి ఉండగా.. గొల్లప్రోలునే ఉన్నానని సాయంత్రం వరకు వస్తానని చెప్పాడని, అయితే ఆదివారం పోలీసుల ఎదుట హాజరుకానున్నట్లు సమాచారం. ఆత్మహత్య చేసుకునే ముందు దేవరాజుకు ఫోన్‌ కాల్‌ చేసిందని, ఈ సంభాషణకు సంబంధించిన ఆధారాలను పోలీసులకు దేవరాజు అందించాడు. సూసైడ్‌ చేసుకున్న రోజు ఇంట్లో పెద్ద గొడవ జరిగిందని, శ్రావణిని కుటుంబ సభ్యులు, సాయికృష్ణారెడ్డి దూషించడంతో పాటు, చేయి చేసుకుంటున్నట్లుగా దేవరాజుకు చేసిన ఫోన్‌కాల్‌లో ఉన్నట్లు సమాచారం.

అలాగే శ్రావణిపై జరిగిన దాడి సమయంలో తన ఫోన్‌ను దేవరాజుకు ఫోన్‌ కలిపి అలాగే ఉంచిందని, ఆ సంభాషణలన్నీ అందులో రికార్డయినట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. ఇవన్ని ఆధారాలు దేవరాజు పోలీసులకు సమర్పించినట్లు తెలుస్తోంది. అలాగే శ్రావణి ఆత్మహత్యకు పాల్పడిన ముందు రోజు అమీర్‌పేటలోని ఓ రెస్టారెంట్‌లో దేవరాజు, శ్రావణి కలిసి రాత్రి భోజనం చేస్తున్న విషయం తెలుసుకున్న సాయికృష్ణారెడ్డి సదరు రెస్టారెంట్‌ వద్ద గొడవ చేసినట్లు, తనను తిడుతూ లాక్కు వెళ్లిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయని, వాటిని పోలీసులు సేకరించారు. వీటి ఆధారంగా విచారణ జరిపితే అసలు టీవీ నటి ఆత్మహత్యకు గల కారణాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసులు పేర్కొంటున్నారు. మరో వైపు సాయికృష్ణారెడ్డితో పాటు కుటుంబ సభ్యులను సైతం విచారణ జరిపితే వెలుగులోకి వచ్చే విషయాలను పరిగణలోకి తీసుకొని కేసును ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉందని పోలీసులు పేర్కొంటున్నారు. కేసులో సాయికృష్ణారెడ్డిపై సైతం ఆరోపణలున్నాయి. అసలు సాయికృష్ణారెడ్డికి, శ్రావణి కుటుంబానికి ఉన్న సంబంధం, శ్రావణి.. దేవరాజుతో వెళ్తుండడం ఎందుకు కోపం పెంచుకున్నాడనే కోణంలోనూ విచారించనున్నట్లు తెలుస్తోంది. 

ఆత్మహత్య కేసులో అనుమానాలెన్నో..!

టీవీ నటి ఆత్మహత్య కేసుల్లో అనుమానాలెన్నో వ్యక్తమవుతున్నాయి. శ్రావణికి దేవరాజు టిక్‌టాక్‌ ద్వారా పరిచయమయ్యాడని, అప్పటి నుంచి వేధింపులకు గురి చేస్తున్నాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. గతంలో వేధింపులు భరించలేకనే గతంలో ఎస్సానగర్‌ పోలీస్‌స్టేషన్‌లో పోలీసులు కేసు నమోదు చేశారు. దేవరాజును అరెస్టు చేసి రిమాండ్‌కు సైతం పంపారు. అయినా ఇటీవల మళ్లీ తరుచూగా డబ్బుల కోసం సైతం వేధింపులకు గురి చేస్తున్నాడని, దీంతో భరించలేకనే ఆత్మహత్యకు పాల్పడినట్లుగా కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కుటుంబ సభ్యుల ఆరోపణలను దేవరాజు ఖండించారు. బలవన్మరణానికి కారణం కుటుంబ సభ్యులు, సాయికృష్ణారెడ్డి అనే వ్యక్తి కారణమని చెప్పాడు. శ్రావణి తనను ప్రేమిస్తోందని, పెళ్లి చేసుకుంటానని చెప్పిందని దేవరాజు పేర్కొంటున్నాడు. కుటుంబ సభ్యులతో పాటు, సాయి దుర్భాషలాడడంతో పాటు కొట్టేవారని దేవరాజు పేర్కొన్నాడు. తన ముందే ఒకసారి శ్రావణి చంపాలని చూశాడని, పెళ్లి చేసుకోవాలని వేధించేవాడని పేర్కొన్నారు. ఇదే విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లాడు. మరో వైపు కృష్ణారెడ్డి సైతం దేవరాజు చేసిన ఆరోపణలు ఖండించారు. తాను ఆ ఫ్యామిలీకి స్నేహితుడినని తెలిపాడు. శ్రావణితో ఎన్నడూ అసభ్యంగా ప్రవర్తించలేదని, దేవరాజు పరిచయం నాటి నుంచే ఆ కుటుంబానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆరోపించాడు.

వెలుగులోకి మరో వీడియో..

శ్రావణి ఆత్మహత్య కేసు రోజుకు మలుపు తిరుగుతోంది. రోజులు గడిచినకొద్దీ రోజుకు ఆడియో, వీడియో క్లిప్పింగులు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా శుక్రవారం వెలుగులోకి వచ్చిన వీడియోతో మరింత గందరగోళం నెలకొంది. వీడియోలో శ్రావణి దేవరాజు పుట్టిన రోజు సందర్భంగా ఒక వీడియోను షూట్‌ చేసింది. ఇందులో దేవరాజును మై లవ్‌లీ హీరో అంటు పిలిచింది. అలాగే ఆరోపణలు ఎదుర్కొంటున్న దేవరాజుపై తనకున్న అభిమానాన్ని చాటింది. తనకు ఎంతో మంది స్నేహితులు ఉన్నారని, తక్కువ సమయంలో దగ్గరైంది దేవరాజుకేనని చెప్పింది. తన గురించి, కుటుంబం గురించి ఎక్కువగా ఆలోచిస్తాడని, ఇలా అలాచెయ్‌ అంటూ మంచి సలహాలు సూచనలిస్తాడని చెప్పుకొచ్చింది. అలాగే తాను దేవరాజును ఎన్నో సార్లు హర్ట్‌ చేశానని, తాను ఎవరికీ సారీ చెప్పనని.. మొదటి సారినీకే చెబుతున్నానని, ఇంకా పలు విషయాలను వెల్లడించింది. దీన్ని బట్టి ఇద్దరు ప్రేమించుకుంటున్నట్లుగా అర్థమవుతోంది. ఇంతకు ముందు వెలుగులోకి వచ్చిన ఓ ఆడియోలో దేవరాజ్‌ బెదిరింపులకు పాల్పడినట్లు స్పష్టంగా ఉంది. ‘మర్యాదగా వచ్చి తనతో గంట టైం గడపాలంటూ’ బెదిరించినట్టు ఆడియోలో ఉంది. ‘తర్వాత జరిగే పరిణామాలకు తనను అడగవద్దని’ హెచ్చరించాడు.

దీంతో శ్రావణి స్పందిస్తూ.. ‘ఇంతటితో ఆపేయ్‌.. నీతో మాట్లాడను దేవా’ అంటూ ప్రాధేయ పడినట్టు ఆడియోలో రికార్డయింది. అలాగే ఓ సినీ నిర్మాతతో శ్రావణి మాట్లాడినట్లుగా తెరపైకి వచ్చింది. శ్రావణి వేధింపులపై కేసు పెట్టిన సందర్భంలో సదరు నిర్మాతతో మాట్లాడినట్టుగా సమాచారం. వెలుగులోకి వచ్చిన ఆడియో, వీడియో క్లిప్పింగ్‌లతో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఓ వీడియోలో దేవరాజుపై ప్రేమగా మాట్లాడడం, మరో ఆడియోలో తనను ఇబ్బందులకు గురి చేయొద్దని, ఇక తనను వదిలేయమని వేడుకోవడం కనిపించింది. సదరు నిర్మాతతో మాట్లాడినట్లుగా ఉన్న ఆడియోలో దేవరాజుపై చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ప్రస్తుతం ఆత్మహత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే సేకరించిన వివరాల మేరకు దర్యాప్తు చేస్తున్న సాయికృష్ణారెడ్డి, కుటుంబ సభ్యులను సైతం విచారిస్తే కేసు ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo