బుధవారం 23 సెప్టెంబర్ 2020
Crime - Jun 28, 2020 , 19:32:21

ఉగ్రవాది తల్లి అరెస్ట్.. ఫొటో విడుదల చేసిన పోలీసులు

ఉగ్రవాది తల్లి అరెస్ట్.. ఫొటో విడుదల చేసిన పోలీసులు

శ్రీనగర్ : అక్రమ కార్యకలాపాల ఆరోపణలపై ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన ఓ ఉగ్రవాది తల్లిని పోలీసులు అరెస్టు చేశారు. ఉగ్రవాదులకు సహాయం చేయడమే కాకుండా యువకులను ఉగ్రవాదులుగా చేర్చుకున్నట్లు మహిళపై ఆరోపణలు ఉన్నాయి. మహిళ అరెస్ట్‌పై సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో పోలీసులు ఆమెకు సంబంధించిన రెండు ఫొటోలను విడుదల చేశారు. వర్గాల మధ్య చిచ్చు పెట్టాలన్న ఉద్దేశమేదీ తమకు లేదని, నెటిజన్ల ప్రశ్నలకు సమాధానంగా ఫొటోలు విడుదల చేయాల్సి వచ్చిందని జమ్ముకశ్మీర్‌ పోలీసులు చెప్తున్నారు.

అరెస్ట్‌ అయిన మహిళ పేరు నాసిమా బానో. ఈమెను 8 రోజుల క్రితం అరెస్టు చేశారు. ఆమె కుల్గాంకు చెందిన రాంపోరా కైమోహ్ నివాసి. ఈమె కుమారుడు ఉగ్రవాదిగా మారి పోలీసు కాల్పుల్లో 2018 మే 6 న హతమయ్యాడు. మహిళను అరెస్టు చేసినందుకు పోలీసులపై సోషల్ మీడియాలో నెటిజెన్లు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు. అనంతరం పోలీసులు మహిళను అరెస్టు చేసినట్లు స్పష్టం చేస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. 

చట్టపరమైన నిబంధనలను దృష్టిలో ఉంచుకునే మహిళను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. అరెస్ట్‌ చేసిన తర్వాత ఆమెను అనంతనాగ్ మహిళా పోలీస్ స్టేషన్లో ఉంచామని పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు పోలీసులు సదరు మహిళ ఫొటోను విడుదల చేశారు. ఆ ఫొటోలో ఓ యువకుడితో కలిసిన వున్న మహిళ.. చేతిలో ఏకే 47 తుపాకీని పట్టుకొని ఉన్నది. ఈ ఒక్క ఫొటో చాలు మొత్తం కథను వివరించేందుకు అని పోలీసులు చెప్తున్నారు. ఈ మహిళ ఇద్దరు యువకులను ఉగ్రవాదంలోకి దింపడమే కాకుండా వారికి ఆయుధాలు, మందుగుండు సామగ్రి, కమ్యూనికేషన్ పరికరాలు, ఇతర అవసరాలు కూడా అందించారని ఆరోపించారు. 


logo