లక్నో: భార్యను భర్త దారుణంగా కొట్టాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇది జరిగిన తర్వాత భర్త మళ్లీ దాడి చేయగా భార్య మరణించింది. ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్ జిల్లాలో ఈ దారుణం జరిగింది. హషిమ్ అనే వ్యక్తి మొదటి భార్య నుంచి ఇంకా విడాకులు పొందక ముందే నెల రోజుల కిందట ఒక మహిళను రెండో పెండ్లి చేసుకున్నాడు. ఇటీవల ఆమె బంధువుల ఇంట్లో వారి సమక్షంలోనే భార్యను దారుణంగా కొట్టాడు. ఆమె నోటి నుంచి రక్తం కారింది. అంత బాగా కొట్టవద్దంటూ ఒక మహిళ అంటున్న మాటలు ఆ వీడియోలో ఉన్నాయి. ఇది జరిగిన కొన్ని రోజులకు ఆ భర్త మళ్లీ భార్యను దారుణంగా కొట్టాడు. దీంతో ఆదివారం ఆమె చనిపోయింది.
ఈ నేపథ్యంలో గతంలో భార్యపై భర్త దాడి చేసిన వీడియోను ఆమె సోదరి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది. మొదటి భార్య నుంచి విడాకులు పొందకముందే తమ సోదరిని గత నెలలో పెండ్లి చేసుకుని ప్రతి రోజూ హింసించాడని ఆరోపించింది. ఇలాంటిది మరో మహిళకు జరుగకుండా అతడ్ని కఠినంగా శిక్షించాలని మీడియా ఎదుట డిమాండ్ చేసింది.
మరోవైపు మహిళ తండ్రి ఫిర్యాదుపై పోలీసులు హత్య కింద కేసు నమోదు చేశారు. భర్త హషిమ్ అతడి కుటుంబ సభ్యులు పరారీలో ఉండటంతో వారిని ఇంకా అరెస్ట్ చేయలేదు.