మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Crime - Jun 20, 2020 , 19:12:19

ఆన్‌లైన్‌ స్టడీకి మొబైల్‌ లేదని విద్యార్థి ఆత్మహత్య

ఆన్‌లైన్‌ స్టడీకి మొబైల్‌ లేదని విద్యార్థి ఆత్మహత్య


కోల్‌కతా: కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో దేశవ్యాప్తంగా మూతపడిన పాఠశాలలు ఇప్పుడిప్పుడే తెరుచుకొనే అనవాళ్లు కనిపించడం లేదు. పాఠశాలలు తెరిస్తే వైరస్‌ మరింత వ్యాప్తి చెందుతున్నదన్న భయంతో చాలా  పాఠశాలలు అన్‌లైన్‌ ఎడ్యుకేషన్‌ను ప్రారంభించాయి. దీనిలో భాగంగా చాలా మంది విద్యార్థులు ముఖ్యంగా గ్రామీణ విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. కొందరు నెట్‌ కనెక్షన్‌ లేక ఇబ్బంది పడుతుండగా.. పేదరికంలో మగ్గుతున్నవాళ్లేమో కంప్యూటర్లు, మొబైల్‌ ఫోన్లే లేక నానా అగచాట్లు పడుతున్నారు. ఇలాగే ఆన్‌లైన్‌ ఎడ్యుకేషన్‌ కోసం ఇంట్లో స్మార్ట్‌ ఫోన్‌ లేకపోవడంతో చదువుకొనేందుకు అవకాశం లేక ఓ పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పశ్చిమ బెంగాల్‌లోని హౌరా జిల్లాలో జరిగింది. 

హౌరా జిల్లాలోని బల్లి గ్రామానికి చెందిన ఓ అమ్మాయి స్థానిక పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో పాఠశాలలు నడువకుండా కేవలం ఆన్‌లైన్‌ తరగతులు ప్రారంభించారు. అయితే, ఈ అమ్మాయి తండ్రి టక్కు డ్రైవర్‌గా పనిచేస్తూ విధుల్లో భాగంగా ఇంట్లో ఉన్న మొబైల్‌ ఫోన్‌ తీసుకెళ్లాడు. దాంతో ఆ అమ్మాయి ఆన్‌లైన్‌ తరగతులకు హాజరుకాలేకపోయింది. ఆన్‌లైన్‌ తరగతులకు డుమ్మా కొడితే చదువుల్లో వెనుకబడి పదో తరగతి పాస్‌ కాలేనన్న భయంతో.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకొంది. క్రికెట్‌ మైదానం నుంచి ఇంటికొచ్చిన తమ్ముడు.. అక్క ఉరేసుకొని చనిపోయి ఉండటాన్ని గమనించాడు. నిశ్చింద పోలీస్‌ స్టేషన్‌ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

తాను మొబైల్‌ ఫోన్‌ తీసుకురాకపోయి వుంటే తన కూతురు బతికేదంటూ తండ్రి కన్నీరుమున్నీరవుతున్న దృశ్యం అందరినీ కంటతడి పెట్టిస్తోంది. తన కూతురు మామూలు ఫోన్‌ వాడుతున్నదని, అది కూడా నీటిలో పడి పనిచేయడంలేదని ఆ అమ్మాయి బాధపడుతూ చెప్పాడు. చదువుల్లో హుషారుగా ఉండే అమ్మాయి చనిపోవడంతో బల్లి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. 


logo