గురువారం 01 అక్టోబర్ 2020
Crime - Jun 15, 2020 , 14:27:25

అదుపులోకి టీపీఎఫ్‌ అగ్రనేత

అదుపులోకి టీపీఎఫ్‌ అగ్రనేత

ఖమ్మంలో కలకలం

ఖమ్మం: తెలంగాణ ప్రజా ఫ్రంట్‌ అగ్రనేత, రాష్ట్ర ఉపాధ్యక్షుడు నలమాస కృష్ణను ఎన్‌ఐఏ (నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ) పోలీసులు అదుపులోకి తీసుకోవడం ఖమ్మంలో కలకలం రేపింది. కృష్ణ తీవ్ర అనారోగ్యంతో నగరంలోని ఓ ప్రైవేటు దవాఖానలో రెండురోజులుగా చికిత్స పొందుతున్నాడు. విషయం తెలుసుకున్న ఎన్‌ఐఏ పోలీసులు హైదరాబాద్‌ నుంచి ఖమ్మం వచ్చి ఆదివారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. మావోయిస్టు పార్టీ సానుభూతిపరుడైన కృష్ణను పోలీసులు రహస్యంగా విచారిస్తున్నారు. వారం క్రితమే అతడు జైలు నుంచి విడుదలయ్యాడు.

  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలంలోని కొమరారం గ్రామానికి చెందిన కృష్ణ 2004లో మావోయిస్టులకు ప్రభుత్వానికి జరిగిన చర్చల్లో కీలక పాత్ర పోషించాడు. హైదరాబాద్‌లో ప్రస్తుతం తెలంగాణ ప్రజా ఫ్రంట్‌ కార్యకలాపాలు నిర్వర్తిస్తున్నట్లు సమాచారం. తెలంగాణ విద్యార్థి వేదిక (టీవీవీ) ప్రెసిండెంట్‌ బండారి మద్దిలేటికి ఇతను దగ్గరి సహచరుడు. సీపీఐ మావోయిస్టు పార్టీతో సంబంధాలు కలిగి ఉన్నందున వీరిద్దరూ గతంలో అరెస్టయ్యారు. కేసు నల్లకుంట స్టేషన్‌ పరిధిలో ఉంది. ఛత్తీస్‌గఢ్‌లోని సీపీఐ మావోయిస్టు అగ్రనేతలను కలుస్తూ వారి సమాచారాన్ని మద్దిలేటికి ఎప్పటికప్పుడు చేరవేస్తాడని కృష్ణపై ప్రధాన ఆరోపణ.  కాగా, దవాఖానకు చేరుకున్న ఎన్‌ఐఏ టీంలోని ఒక డీఎస్పీ స్థాయి అధికారి కృష్ణ కూతురును, ఆయన బంధువులను విచారించారినట్లు తెలుస్తున్నది. అనంతరం కృష్ణను తమ అదుపులోకి తీసుకుంటున్నట్లు ఎఫ్‌ఐఆర్‌ కాపీ అందించారని కృష్ణ కూతురు విలేకరులతో వెల్లడించింది . తీవ్ర అనారోగ్యంతో ఉన్న అతడిని హైదరాబాద్‌ తరలించేందుకు పరిస్థితులు అనుకూలించకపోవడంతో స్థానిక పోలీసులకు ఎన్‌ఐఏ టీం ఈ వ్యవహరాన్ని అప్పగించి వెళ్లినట్లు సమాచారం. logo