బుధవారం 12 ఆగస్టు 2020
Crime - Jul 03, 2020 , 16:15:37

పెళ్లైన 12 రోజుల‌కే.. ప్రియుడి కుటుంబంపై క‌త్తుల‌తో దాడి

పెళ్లైన 12 రోజుల‌కే.. ప్రియుడి కుటుంబంపై క‌త్తుల‌తో దాడి

చెన్నై : ఓ జంట ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అమ్మాయి త‌ర‌పు వారు ఈ పెళ్లికి ఒప్పుకున్న‌ప్ప‌టికీ.. మొద‌ట్లో అబ్బాయి కుటుంబ స‌భ్యులు ఒప్పుకోలేదు. ఆ త‌ర్వాత అంగీక‌రించారు. మొత్తానికి పెళ్లైన 12 రోజుల‌కే ప్రియుడి కుటుంబంపై ప్రియురాలి బంధువులు క‌త్తుల‌తో దాడి చేశారు. 

త‌మిళ‌నాడు ట్యుటికోరిన్ జిల్లాలోని శివ‌గాలై గ్రామానికి చెందిన విఘ్నేష్(22), సంగీత‌(20) గ‌త కొంత‌కాలం నుంచి ప్రేమించుకుంటున్నారు. వీరిద్ద‌రిది ఒకే సామాజిక వ‌ర్గం కావ‌డంతో.. అమ్మాయి త‌ర‌పు వారు వీరి ప్రేమ‌ను ఆహ్వానించారు. కానీ అబ్బాయి కుటుంబ స‌భ్యులు మాత్రం ముందు ఒప్పుకోలేదు. త‌ర్వాత పెద్ద మ‌న‌సు చేసుకుని పెళ్లికి అంగీక‌రించారు. 

దీంతో 12 రోజుల క్రితం విఘ్నేష్, సంగీత ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే క‌ట్నం కింద బంగారు ఆభ‌ర‌ణాలు, న‌గ‌దు తేవాల‌ని విఘ్నేష్.. సంగీత‌పై ఒత్తిడి చేస్తున్న‌ట్లు ఆమె కుటుంబ స‌భ్యులు ఆరోపించారు. ఈ క్ర‌మంలో గురువారం రాత్రి విఘ్నేష్ ను సంగీత సోద‌రుడు.. మాట్లాడుకుందామ‌ని గ్రామ స‌మీపంలోకి పిలిపించాడు. అక్క‌డికెళ్లాక కాసేపు మాట్లాడుకున్నారు. అంత‌లోనే విఘ్నేష్ పై క‌త్తుల‌తో దాడి చేయ‌డంతో.. అత‌ను భ‌య‌ప‌డి గ్రామంలోకి ప‌రుగెత్తాడు. 

గాయాల‌తో ఇంటికి చేరుకున్న కుమారుడిని చూసి త‌ల్లిదండ్రులు ఆందోళ‌న‌కు గుర‌య్యారు. వారిపై కూడా సంగీత బంధువులు క‌త్తుల‌తో దాడి చేశారు. దీంతో విఘ్నేష్ త‌ల్లితో పాటు మ‌రొక‌రు ప్రాణాలు కోల్పోయారు. తండ్రికి స్వ‌ల్ప గాయాల‌య్యాయి. 

ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ముగ్గురు నిందితుల‌ను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల‌ను క‌ఠినంగా శిక్షించాల‌ని విఘ్నేష్ కుటుంబ స‌భ్యులు డిమాండ్ చేస్తున్నారు.


logo