గురువారం 01 అక్టోబర్ 2020
Crime - Sep 09, 2020 , 14:12:26

'డ‌బ్బు కోస‌మే మేన‌త్త‌ను హ‌త్య చేసిన మేన‌ల్లుడు'

'డ‌బ్బు కోస‌మే మేన‌త్త‌ను హ‌త్య చేసిన మేన‌ల్లుడు'

వరంగల్ అర్బన్ : హన్మకొండ టైలర్ స్ట్రీట్ ప్రాంతంలో ఈ నెల 3వ తేదీన‌ హత్యకు గురైన దోర్నం శారద అనే మహిళ కేసులో ముగ్గురు నిందితులను హన్మకొండ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ప్ర‌ధాన నిందితుడు ఆడెపు ఆకాశ్ బాబు, మేక‌ల మ‌చ్చేంద‌ర్‌తో పాటు మ‌రో బాల నేర‌స్తుడిని అరెస్టు చేశారు. వీరి వ‌ద్ద నుండి బంగారు ఆభరణాలతో పాటు రూ. 2,71000, మూడు సెల్‌ఫోన్ల‌ను స్వాధీనం చేసుకున్నారు. కేసు వివ‌రాల‌ను వరంగల్ పోలీస్ కమిషనర్ పి. ప్రమోద్ కుమార్ వెల్లడించారు. మృతురాలు శారద తన భర్త మరణించడంతో కూతురు, కొడుకు అఖిల్‌తో క‌లిసి హన్మకొండలోని టైలర్ స్ట్రీట్ ప్రాంతంలో నివాసం ఉంటోంది. జీవనోపాధి కోసం తాను నివాసం ఉంటున్న ఇంటి క్రిందే కూరగాయల వ్యాపారం చేసేది. కూతురు హైదరాబాద్‌లో ఇంజనీరింగ్ చదువుచుండగా, కుమారుడు నిఖిల్ త‌ల్లితోనే ఉంటూ ఇంటర్మీడియట్ చదువుచున్నాడు.

కూరగాయల వ్యాపారం ద్వారా వచ్చే అదాయాన్ని మ‌హిళ ఇంట్లోని బీరువాలో దాచేది. చెడువ్య‌స‌నాల‌కు అల‌వాటుపడిన ఆమె అన్న కొడుకు ఆడెపు ఆకాశ్ బాబు కొన్నిరోజులు ఉండేందుకు వ‌చ్చాడు. ఆ స‌మ‌యంలో త‌న మేన‌త్త బిడ్డ పెండ్లికోస‌మ‌ని బీరువాలో దాచే న‌గ‌లు, న‌గ‌దును గ‌మ‌నించాడు. ఈ డబ్బును ఎలాగైనా కొట్టేయాని ప‌థ‌కం వేశాడు. ఈ నెల 3వ తేదీ తెల్లవారుజాము ఇంటి వెనుక తలుపు తీసిఉండ‌టంతో దాని ద్వారా ఇంట్లోకి ప్ర‌వేశించాడు. అదే సమయంలో మెలుకుతో వున్న తన మేనత్తపై నిందితుడు ఒక్కసారిగా బండరాయితో దాడిచేసి హత‌మార్చాడు. అంత‌టితో ఆగ‌క నిద్రలో ఉన్న‌ కుమారుడు నిఖిల్ పై సైతం నిందితుడు బండరాయితో దాడి చేసి హత్యయత్నానికి పాల్ప‌డ్డాడు. అనంతరం నిందితుడు గదిలో ఉన్న బీరువాలోని బంగారు నగలు, డబ్బును అప‌హ‌రించుకు వెళ్లిపోయాడు.

మేనత్త హత్య అనంత‌రం నిందితుడు మిగితా ఇద్దరు నిందితులను సంప్రదించడంతో వారు ఆకాశ్‌కు ఆశ్రయం కల్పించారు. ఇందుకోసం బాల నేరస్థుడు రూ. 51వేలు, మేకల మచ్చేందర్ రూ. ఒక లక్ష 50 వేలు తీసుకున్నారు. హత్య అనంతరం కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. సీసీ టీవీ కెమెరాల ఫుటేజీతో నిందితుడిని గుర్తించారు. ముగ్గురు నిందితుల‌ను నేడు అరెస్టు చేశారు. హత్య కేసును విజ‌య‌వంతంగా ఛేదించిన సెంట్రల్ జోన్ ఇంచార్జ్ డి.సి.పి పుష్పా, హన్మకొండ ఏసీపీ జితేందర్ రెడ్డి, సుబేదారి ఇనన్స్ స్పెక్టర్ అజయ్, హన్మకొండ, సుబేదారి ఎస్ఐలు శ్రీనివాస్, వేణుగోపాల్ తోపాటు ఇతర సిబ్బందిని పోలీస్ కమిషనర్ అభినందించారు.


logo