గురువారం 03 డిసెంబర్ 2020
Crime - Oct 26, 2020 , 12:36:32

నాచారం చోరీ కేసులో నేపాలీ ముఠా అరెస్ట్‌

నాచారం చోరీ కేసులో నేపాలీ ముఠా అరెస్ట్‌

హైద‌రాబాద్ : నాచారం చోరీ కేసులో నేపాలీ ముఠాను అరెస్టు చేసిన‌ట్లు రాచ‌కొండ పోలీసు క‌మిష‌న‌ర్ మ‌హేశ్ భ‌గ‌వ‌త్ సోమ‌వారం మ‌ధ్యాహ్నం మీడియాకు వెల్ల‌డించారు. ఇంట్లో ప‌ని మ‌న‌షులుగా చేరిన నేపాలీ వాసులు అర్జున్‌, మాయ చోరీకి పాల్ప‌డిన‌ట్లు తెలిపారు. ఇంట్లో ఒంట‌రిగా ఉన్న వృద్ధురాలికి మ‌త్తు మందు ఇచ్చి చోరీ చేసిన‌ట్లు నిర్ధారించారు. నాచారం హెచ్ఎంటీ న‌గ‌ర్ వాసి ప్ర‌దీప్ కుమార్ ఇంట్లో పదిహేను రోజుల క్రితం.. నేపాలీ వాసులు అర్జున్, మాయ ప‌ని మన‌షులుగా దిగారు. తామిద్ద‌రం భార్యాభ‌ర్త‌ల‌మ‌ని ప్ర‌దీప్ కుమార్‌ను నమ్మించారు. కానీ వీరు దంప‌తులు కాదు. 

అయితే ఈ నెల 19వ తేదీన ప్ర‌దీప్ కుమార్‌, త‌న కుమారుడు ఆఫీస్‌కు వెళ్లిపోయారు. అదే రోజు ప్ర‌దీప్ భార్య‌, కూతురు క‌లిసి మెద‌క్‌కు ఓ ఫంక్ష‌న్‌కు వెళ్లారు. ఆ త‌ర్వాత ప్ర‌దీప్ త‌ల్లి(70)కి మ‌త్తు మందు ఇచ్చి ఇంట్లో ఉన్న 19 తులాల బంగారం, రిస్ట్ వాచ్‌తో పాటు ఇత‌ర విలువైన వ‌స్తువుల‌ను దొంగిలించారు.

ఆ రోజు రాత్రి 9 గంట‌ల స‌మ‌యంలో ప్ర‌దీప్ ఇంటికి రాగా, త‌ల్లి అప‌స్మార‌క స్థితిలోకి వెళ్లిపోయింది. దీంతో ఆయ‌న నాచారం పోలీసుల‌ను ఆశ్ర‌యించాడు. ప్ర‌దీప్ ఫిర్యాదు మేర‌కు నాచారం పోలీసులు ఎఫ్ఐఆర్ న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టి ఈ కేసును చేధించిన‌ట్లు పోలీసు క‌మిష‌నర్ మ‌హేశ్ భ‌గ‌వ‌త్ తెలిపారు.