సోమవారం 25 జనవరి 2021
Crime - Oct 27, 2020 , 18:39:18

ఈ దొంగ రూటే సెప‌రేటు.. కాళ్లు మొక్కి కాజేస్తాడు

ఈ దొంగ రూటే సెప‌రేటు.. కాళ్లు మొక్కి కాజేస్తాడు

న్యూఢిల్లీ: దొంగ‌లు సాధార‌ణంగా తాళం వేసిన ఇళ్ల‌ను టార్గెట్ చేసి క‌న్నం వేస్తారు. కొన్ని గ్యాంగులు మ‌నుషుల ఇండ్ల‌లో చొర‌బ‌డి, ఆ ఇంట్లో మ‌నుషుల‌ను బెదిరించి, వారిపై దాడి చేసి దోపిడీల‌కు పాల్ప‌డుతారు. ఇంకొంద‌రు దారికాచి దోచుకుంటారు. మ‌రీ క‌రుడుగ‌ట్టిన దొంగ‌లైతే హ‌త్య‌లు చేసిన దోచుకుంటారు. కానీ ఓ దొంగ మాత్రం ఇవేవీ ప‌ట్టించుకోడు. అత‌డి రూటే సెప‌రేటు. తాను టార్గెట్ చేసిన వ్య‌క్తికి రెండు చేతులు జోడించి దండం పెడుతాడు. అస‌ర‌మైతే అమాంతం కాళ్ల‌మీద ప‌డుతాడు. ఆ త‌ర్వాత వారి ద‌గ్గరి బంధువుకో, స్నేహితుడికో బాగా తెలిసిన వ్య‌క్తిగా ప‌రిచ‌యం చేసుకుంటాడు. ఎదుటివారికి అత‌నిపై న‌మ్మ‌కం కుద‌ర‌గానే వారి ద‌గ్గరున్న బంగారం ఒక‌సారి చూసిస్తాన‌ని తీసుకుని పారిపోతాడు.

ఇది న‌మ‌స్తే గ్యాంగ్ ప్ర‌ధాన సూత్ర‌ధారి చాంద్ మ‌హ‌మ్మ‌ద్ దొంగ‌త‌నం చేసే స్టైల్‌‌. అత‌డు, అత‌డి గ్యాంగ్ దండం పెట్టి దోచుకుంటుంది కాబ‌ట్టే ఆ గ్యాంగ్‌కు న‌మ‌స్తే గ్యాంగ్ అనే పేరుప‌డింది. అయితే, ఈ గ్యాంగ్ ప్ర‌ధాన సూత్ర‌దారి అయిన చాంద్ మ‌హ్మ‌ద్ (35)ను మంగ‌ళ‌వారం పోలీసులు అరెస్ట్ చేశారు. హ‌ర్యానా రాష్ట్రం, ఫ‌రీదాబాద్ జిల్లా వాసి అయిన చాంద్ మ‌హ్మ‌ద్ క‌ద‌లిక‌ల‌పై గ‌త కొన్నాళ్లుగా నిఘా వేసి ఎట్ట‌కేల‌కు ప‌ట్టుకున్నారు. అత‌నితోపాటు అత‌ని నుంచి దొంగ బంగారం కొనుగోలు చేసే దినేశ్ కుమార్ సోని (47)ని కూడా అదుపులోకి తీసుకున్నారు. 

నిందితుల‌పై మైదాన్‌గ‌ర్హి పోలీసులు ఐపీసీ సెక్ష‌న్ 420 కింద కేసు న‌మోదు చేశారు. నిందితుడు మైదాన్‌గ‌ర్హితోపాటు ద‌క్షిణ ఢిల్లీలోని నెబ్ స‌రాయ్‌, సంగ‌మ్ విహార్, గోవింద్‌పురి, అంబేద్క‌ర్ న‌గ‌ర్‌, మాల‌వీయ న‌గ‌ర్ త‌దిత‌ర ప్రాంతాల్లో 2017 నుంచి ఇప్ప‌టివ‌ర‌కు ఇదేత‌ర‌హాలో ప‌లు దొంగ‌త‌నాలు చేసిన‌ట్లు పోలీసులు గుర్తించారు.  ‌ 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo