సోమవారం 30 నవంబర్ 2020
Crime - Oct 22, 2020 , 21:48:02

ఏసీబీ వలలో మున్సిపల్ డీఈఈ హన్మంతరావు నాయక్

ఏసీబీ వలలో మున్సిపల్ డీఈఈ హన్మంతరావు నాయక్

హైద‌రాబాద్ : దుండిగ‌ల్ పుర‌పాల‌క‌శాఖ డిప్యూటీ ఈఈ హ‌న్మంత‌రావు నాయ‌క్ అవినీతికి పాల్ప‌డుతూ ఏసీబీ అధికారుల‌కు చిక్కాడు. బ‌కాయి బిల్లుల చెల్లింపు కోసం గుత్తేదారును లంచం డిమాండ్ చేసి రూ. 2.25 ల‌క్ష‌లు తీసుకుంటుండ‌గా అవినీతి నిరోధ‌క‌శాఖ అధికారులు రైడ్ చేసి ప‌ట్టుకున్నారు. హ‌న్మంత‌రావు నాయ‌క్ సూర్యాపేట మున్సిపాలిటీలోని ఇంజినీరింగ్ విభాగంలో డిప్యూటి ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌గా పనిచేసి ఇటీవలే దుండిగల్‌కు బదిలీపై వ‌చ్చారు. సూర్యాపేటలో ఓ ప‌నికి సంబంధించిన చెక్ మేజర్మెంట్ చేయడానికి రియసత్ ఖాన్ అనే వ్యక్తి నుంచి లంచం డిమాండ్ చేశాడు. సూర్యాపేటలో పని చేస్తున్నప్ప‌టి నుంచి డబ్బుల కోసం ఈ పనిని పెండింగులో పెట్టాడు. డబ్బులు ఇస్తేనే ఫైల్‌ను పై అధికారులకు పంపుతానని సతాయిస్తూ వచ్చాడు. నాలుగు నెలల కిందట సూర్యాపేట నుంచి దుండిగల్ కు బదిలీ అయ్యాడు. బదిలీ అయ్యాక కూడా ఫైల్ ను తన వద్దనే పెండింగులో పెట్టుకున్నాడు. 

డీఈఈ హన్మంతరావునాయక్ తీరుతో విసిగిపోయిన రియసత్ ఖాన్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో గురువారం సాయంత్రం హైదరాబాద్ లోని ఉప్పల్ ఇండోర్ స్టేడియం ఏరియాలో రియసత్ ఖాన్ నుంచి రూ. 2.25లక్షలు లంచంగా తీసుకుంటూ హన్మంతరావునాయక్ ఏసీబీకి పట్టుబడ్డాడు. ఏసీబీ అధికారులు నగదును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. హన్మంతరావునాయక్ ను అదుపులోకి తీసుకున్నారు. ఇదే సమయంలో సూర్యాపేట మున్సిపల్ కార్యాలయంలోనూ మరో బృందం రికార్డులను పరిశీలించారు. హన్మంతరావునాయక్ ఇక్కడ పని చేసిన సమయంలోని రికార్డులను కొన్నింటిని స్వాధీనం చేసుకున్నారు. హన్మంతరావుకు సంబంధించిన మరికొన్ని ప్ర‌దేశాల్లో కూడా ఈ సోదాలు కొనసాగుతున్నట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు.