ఆదివారం 17 జనవరి 2021
Crime - Jan 14, 2021 , 15:54:58

ప్రాణం తీసిన వేలాడే సరదా.. భార్య చేతిని వదిలేసిన భర్త

ప్రాణం తీసిన వేలాడే సరదా.. భార్య చేతిని వదిలేసిన భర్త

ముంబై: కదులుతున్న రైలు బోగి డోర్‌ వద్ద వేలాడే సరదా ఒక మహిళ ప్రాణాన్ని హరించింది. భార్య చేతిని భర్త వదిలేయడంతో రైలు నుంచి కింద పడిన ఆమె తీవ్రంగా గాయపడి మరణించింది. మహారాష్ట్రలోని ముంబైలో ఈ ఘటన జరిగింది. మన్‌ఖర్డ్ ప్రాంతానికి చెందిన 25 ఏండ్ల మహిళ, 31 ఏండ్ల వ్యక్తి కూలీలు. ఏడేండ్ల కుమార్తె ఉన్న ఆ మహిళను రెండు నెలల కింద ఆ వ్యక్తి పెండ్లి చేసుకున్నాడు. సోమవారం పాపతో కలిసి వారు చెంబూర్ నుంచి లోకల్‌ రైలులో ప్రయాణించారు. ఆ జంట డోర్‌ వద్ద ఉంటూ హ్యాండిల్‌ రాడ్‌ను పట్టుకుని వేలాడారు. ఈ క్రమంలో వేలాడుతున్న భార్య చేతిని భర్త వదిలేశాడు. దీంతో ఆమె రైలు నుంచి కింద పడి తీవ్రంగా గాయపడింది. 

దీనిని గమనించిన లోకల్‌ ట్రైన్‌లోని ప్రయాణికురాలు గోవాండి స్టేషన్‌కు చేరగానే రైల్వే పోలీసులకు సమాచారం అందించింది. దీంతో రైల్వే పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. మహిళ పడిన ప్రదేశానికి వెళ్లి చూడగా ఆమె అచేతనంగా ఉన్నది. ఆసుపత్రికి తీసుకెళ్లగా మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు. దీంతో ఆ వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆ సమయంలో అతడు మత్తుపదార్థాలు సేవించి ఉన్నడా అన్నది దర్యాప్తు చేస్తున్నారు. బాలికను ఆమె తల్లి తరుఫు బంధువులకు అప్పగించారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.