శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Crime - Jul 02, 2020 , 19:34:41

తల్లి ఫేస్‌బుక్‌ ప్రియులు.. బిడ్డ ప్రాణాలు తీశారు

తల్లి ఫేస్‌బుక్‌ ప్రియులు.. బిడ్డ ప్రాణాలు తీశారు

మేడ్చల్ : చేయని నేరానికి ఓ ఐదేండ్ల బాలిక బలైన విషాద ఘటన జిల్లాలో పోచారంలో చోటు చేసుకుంది. పేస్ బుక్ ప్రేమ వ్యవహారం అభం, శుభం తెలియని ఐదేండ్ల బాలిక పాలిట శాపంగా మారింది. తనతో పరిచయమమున్న మహిళ మరో వ్యక్తితో చనువుగా ఉండటాన్ని చూసి ఆ యువకుడు తట్టుకోలేక పోయాడు. సదరు మహిళపై కోపాన్ని ఆమె బిడ్డపై చూపించాడు. ఏ పాపం తెలియని చిన్నారి ఆద్యను అత్యంత పాశవికంగా గొంతు కోసి చంపేశాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం..

భువనగిరి ప్రాంతానికి చెందిన కళ్యాణ్‌ 2011 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్‌ అనంతపురానికి చెందిన అనూషతో వివాహం జరిగింది. వీరికి ఐదేండ్ల పాప ఆద్య ఉంది. కాగా, కళ్యాణ్‌, సోషల్‌ మీడియా ద్వారా పరిచయం కావడంతో ప్రేమ వివాహం చేసుకున్నారని సమాచారం. గురువారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో డయల్‌ 100 ద్వారా ఘట్‌కేసర్‌ పోలీసులకు ఐదేండ్ల పాపను గొంతుకోసి చంపినట్లు విహారి హోమ్స్‌కు చెందిన నివాసులు ఫోన్‌ చేశారు. పోలీసులు స్పాట్‌ చేరుకోగానే కళ్యాణ్‌ ఇంటి ముందు కరుణాకర్‌ గొంతు కోసుకుని రక్తపు మరకలతో చేతిలో కత్తి పట్టుకుని నిలబడ్డాడు. పోలీసులు కరుణాకర్‌ను అదుపులోకి తీసుకుని స్థానిక దవాఖానకు తరలించారు.

అనంతరం ఇంట్లోకి వెళ్లి చూడగా బెడ్‌రూమ్‌లో ఆద్య(5) రక్తపు మడుగులో  పడి మృతి చెందగా..ఆద్యా తల్లి అనూష స్వల్ప గాయాలై షాక్‌ కు గురై  కిందపడిపోయినట్లు పోలీసులు గుర్తించారు. సంఘటన స్థలాన్ని మల్కాజిగిరి డీసీపీ రక్షిత కె మూర్తి, ఏసీపీ నర్సింహరెడ్డి, ఘట్‌కేసర్‌ ఇన్ స్పెక్టర్‌లు సందర్శించారు. 

వివాహేతర సంబంధమేనా?

ఈ సంఘటన పై స్థానికంగా ఇది వివాహేతర సంబంధంతోనే బాలిక హత్యకు దారితీసిందని చర్చించుకుంటున్నారు.  ఆత్మకూరు గ్రామ పంచాయతీలో కార్యదర్శిగా పని చేస్తున్న కళ్యాణ్‌ తన కుటుంబాన్ని రెండు ఏండ్ల కింద భువనగిరి నుంచి పోచారం ఇస్మాయిల్‌ఖాన్‌గూడకు మకాం మార్చాడు. సజావుగా సాగుతున్న వీరి సంసారంలో రెండేండ్ల కింద కరుణాకర్‌ సోషల్‌ మీడియా ద్వారా అనూషకు పరిచయమయ్యాడు. ఆ తర్వాత అదే సోషల్‌ మీడియా ద్వారా రాజన్న సిరిసిల్లకు చెందిన రాజశేఖర్‌ పరిచయం అయ్యాడు. ఇలా ముగ్గురు స్నేహితులుగా మారారు. ఈ సందర్భంలోనే అనుషకు కరుణాకర్‌, రాజశేఖర్‌లతో వివాహేతర సంబంధం ఏర్పడిందని స్థానికులు తెలిపారు. అయితే గత రెండు నెలల నుంచి అనూష కరుణాకర్‌ను దూరం పెట్టింది. రాజశేఖర్‌తో సన్నిహితంగా ఉండడంతో కరుణాకర్‌ అనూష, రాజశేఖర్‌ల మీద కోపాన్ని పెంచుకున్నాడు. 


పట్టించుకోవడం లేదనే కోపంతో..

తనను పట్టించుకోవడం లేదనే కోపంతో కరుణాకర్‌ ముందస్తు ప్రణాళికతో కత్తితో అనూష ఇంటికి వచ్చాడు. అప్పటికే రాజశేఖర్‌ ఇంట్లో ఉన్నాడు. కరుణాకర్‌ వచ్చిన విషయాన్ని గమనించిన అనూష రాజశేఖర్‌ను బాత్‌రూంలో దాచిపెట్టింది. ఆ తర్వాత బెడ్‌రూమ్‌లో ఆద్యతో వచ్చి కూర్చుంది. కరుణాకర్‌ బెడ్‌రూమ్‌లోకి రాగానే రాజశేఖర్‌ విషయంపై ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. వెంటనే అనూష ఆద్యను కరుణాకర్‌ను బెడ్‌రూమ్‌లో వదిలేసి బయటికి వచ్చి గడియ పెట్టింది. ఆగ్రహంతో ఊగిపోతున్న కరుణాకర్‌ తలుపు తీయకపోతే ఆద్యను చంపేస్తానని చెప్పి పాప గొంతు కోశాడు. పాప కేక వినగానే అనూష బయటి నుంచి గడియ తీసి లోపలికి వెళ్లింది.

ఆద్యను రక్తపు మడుగులో చూడగానే షాక్‌లో ఉన్న అనూషను కత్తితో దాడి చేయగా ఆమె అరుస్తూ కుప్పకూలిపోయింది. అనూష కేకలేయడంతో బాత్‌రూమ్‌లో ఉన్న రాజశేఖర్‌ బయటికి రాగా అతనిపై కరుణాకర్‌ కత్తితో దాడి చేశాడు. కరుణాకర్‌ దాడి నుంచి రాజశేఖర్‌ గోడ దూకి తప్పించుకున్నాడు. ఇంతలో గేటు బయటికి వచ్చిన కరుణాకర్‌ అక్కడే గొంతుకోసుకుని నిలబడ్డాడు. ఇంతలో స్థానికులు ఈ విషయాన్ని గమనించి డయల్‌ 100 ద్వారా పోలీసులకు సమాచారం అందించారు. స్పాట్‌కు చేరుకున్న పోలీసులు అతనిని చికిత్స కోసం స్థానిక దవాఖానకు తరలించారు.

ఉద్యోగాల పేరుతో మోసం చేసిందనే..?

ఆద్య హత్య కేసును పోలీసులు మరో కోణంలోనూ విచారిస్తున్నారు. అనూష కరుణాకర్‌, రాజశేఖర్ వీరి ఇద్దరి నుంచి ఉద్యోగాలు పెట్టిస్తానని డబ్బు తీసుకుని ఉద్యోగం ఇప్పించకుండా కాలాయాపణ చేస్తుండటంతో ఆగ్రహంతో కరుణాకర్‌ ఈ సంఘటనకు పాల్పడి ఉంటాడనే మరో కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం నిందితుడు కరుణాకర్‌ పోలీసు కస్టడీలో దవాఖానలో ఉండగా అనుష షాక్‌లో ఉండడంతో ఆమెను ప్రశ్నించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. కాగా, రాజశేఖర్‌ పోలీసు అదుపులో ఉన్నాడు.

అక్కా అని పిలుస్తూనే ఇంతటి ఘోరం..?

అనూషను అక్కా అని పిలుస్తూనే ఇంతటి దారుణానికి ఒడిగట్టారని ఆద్య తండ్రి కళ్యాణ్‌ దు:ఖంలో మునిగిపోయాడు. రాజశేఖర్‌, కరుణాకర్‌ తరచుగా తమ ఇంటికి వచ్చే వారని తనను అన్న అని, అనూషను అక్కను పిలిచే వారని ఆయన తెలిపాడు. నా పాప ఆద్యను చంపేంత తప్పు మేం చేయలేదని ఆయన రోదించాడు.

అనూష నోరు విప్పితేనే..

ఈ సంఘటనలో అనూష, కరుణాకర్‌, రాజశేఖర్‌లు నోరు విప్పితేనే మొత్తం మిస్టరీ వీడనుంది. ఈ ముగ్గురు చెప్పిన స్టేట్‌మెంట్‌లను పోలీసులు పలు కోణాల్లో విచారించనున్నారు. 24 గంటల్లో మొత్తం మిస్టరీ వీడిపోతుందని రాచకొండ పోలీసులు స్పష్టం చేస్తున్నారు. అసలు ఈ సంఘటనలో  ఎలాంటి సంబంధం లేని ఆద్య చనిపోవడం తీవ్ర కలకలం రేపింది. 


logo