మంగళవారం 27 అక్టోబర్ 2020
Crime - Oct 01, 2020 , 19:19:12

పాకిస్తాన్‌లో హిందూ బాలికపై సామూహిక లైంగికదాడి

పాకిస్తాన్‌లో హిందూ బాలికపై సామూహిక లైంగికదాడి

ఇస్లామాబాద్‌ : పాకిస్తాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లో ఓ మైనర్ హిందూ బాలిక సామూహిక లైంగికదాడికి గురై ఆత్మహత్య చేసుకుంది. బాలికను ఇంటి నుంచి ముగ్గురు వ్యక్తులు అపహరించుకుపోయి లైంగికదాడి జరిపారు. నిందితుడు జైలు నుంచి విడుదలైన తర్వాత బ్లాక్‌మెయిలింగ్‌కు దిగడంతో బాధితురాలు ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. 

సింధ్‌ ప్రావిన్స్‌లోని తార్పార్కర్‌ జిల్లాకు చెందిన హిందూ మతానికి చెందిన మైనర్‌ బాలికను గత ఏడాది జూలైలో ఇంటి నుంచి ఎత్తుకెళ్లిపోయి సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో పోలీసులు నిందితులను అరెస్ట్‌ చేసి జైలుకు పంపారు. జైలు నుంచి బెయిల్‌పై విడుదలైన ఒక నిందితుడు.. గతంలో బాలికపై లైంగికదాడి జరిపే సమయంలో చిత్రీకరించిన వీడియోను చూపి బ్లాక్‌మెయిల్ చేయడం ప్రారంభించాడు. దాంతో అవమానానికి గురైన బాలిక బుధవారం నాడు ఇంటి సమీపంలోని బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. బాలిక కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. నిందితులు ఆధిపత్య కుటుంబానికి చెందినవారు కావడంతో కట్టుదిట్టంగా కేసు నమోదు చేయలేదని పలువురు పోలీసులపై ఆరోపణలు చేస్తున్నారు. కాగా, బాలికపై సామూహిక లైంగికదాడి జరిగినట్లు జిల్లా ఎస్‌ఎస్‌పీ అబ్దుల్లా అహ్మదీయార్‌ అంగీకరించారు. వైద్య నివేదికలో లైంగికదాడి జరిగినట్లు ధృవీకరించినట్లు తెలిపారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక హిందూ సంఘం నాయకులు డిమాండ్ చేస్తున్నారు. నిందితులను అరెస్ట్‌ చేయనిపక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు.


logo