గురువారం 01 అక్టోబర్ 2020
Crime - Jun 21, 2020 , 18:03:42

విద్యుదాఘాతంతో వ‌ల‌స కూలీ మృతి.. భార్యాబిడ్డ క్షేమం

విద్యుదాఘాతంతో వ‌ల‌స కూలీ మృతి.. భార్యాబిడ్డ క్షేమం

రాయ్ పూర్ : ఓ వ‌ల‌స కూలీ విద్యుత్ షాక్ తో మృతి చెందాడు. ఈ ప్ర‌మాదం నుంచి అత‌ని భార్య‌, బిడ్డ క్షేమంగా బ‌య‌ట‌ప‌డ్డారు. ఈ విషాద ఘ‌ట‌న ఛ‌త్తీస్ గ‌ఢ్ కొర్బా జిల్లాలోని ఉర్గా పోలీసు స్టేష‌న్ ప‌రిధిలో శ‌నివారం రాత్రి చోటు చేసుకుంది. 

ఛ‌త్తీస్ గ‌ఢ్ లోని కుర్షియాపారా గ్రామానికి చెందిన దిల్హార‌న్ ధ‌న‌వార్ ఉపాధి కోసం కొన్నేళ్ల క్రితం యూపీలోని అల‌హాబాద్ కు వల‌స వెళ్లాడు. అక్క‌డ ఇటుక బ‌ట్టీల్లో ప‌ని చేస్తుండేవాడు. లాక్ డౌన్ కార‌ణంగా.. ధ‌న‌వార్ కాంట్రాక్ట‌ర్ కూలీలంద‌రిని సొంతూర్ల‌కు ప్ర‌త్యేక బ‌స్సుల్లో పంపాడు. 

ఛ‌త్తీస్ గ‌ఢ్ కు చెందిన కూలీలంద‌రూ శ‌నివారం రాత్రి బిలాస్ పూర్ కు చేరుకున్నారు. అక్క‌డ్నుంచి దిల్హార‌న్ త‌న భార్యాబిడ్డ‌తో.. ఆటోరిక్షాలో కంకి గ్రామానికి వ‌చ్చాడు. అయితే క్వారంటైన్ లో ఉండాల‌ని అధికారులు సూచించ‌డంతో.. వారు అక్క‌డ్నుంచి  టార్దా గ్రామానికి చేరుకున్నారు. కానీ అక్క‌డ క్వారంటైన్ సదుపాయాలు లేక‌పోవ‌డంతో.. తిరిగి త‌మ సొంతూరైన కుర్షియాపారాకు శ‌నివారం రాత్రి బ‌య‌ల్దేరారు. 

అధికారుల నుంచి త‌ప్పించుకునేందుకు వారు అట‌వీ మార్గాన్ని ఎంచుకున్నారు. ఆ మార్గంలో వెళ్తుండ‌గా.. ఓ పొలం వ‌ద్ద అడ‌వి పందుల నుంచి పంట పొలాల‌కు ర‌క్ష‌ణ‌గా ఉంచిన విద్యుత్ వైర్ ను దిల్హార‌న్ తొక్కాడు. దీంతో అత‌ను అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ప్ర‌మాదం నుంచి భార్య‌, బిడ్డ ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డారు. 

దిల్హారన్ మృత‌దేహానికి స‌మీపంలోనే ఓ అడ‌వి పంది కూడా చ‌నిపోయి ఉంది.  దిల్హార‌న్ మృతిపై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. అనుమ‌తి లేకుండా విద్యుత్ తీగ‌లు పెట్టిన వారిపై చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని కొబ్రా ఎస్పీ అభిషేక్ మీనా స్ప‌ష్టం చేశారు.   


logo