మంగళవారం 19 జనవరి 2021
Crime - Oct 27, 2020 , 16:54:12

మ‌హిళ‌పై యాసిడ్ దాడి.. మెడ‌, ముఖం కాలిపోయిన వైనం

మ‌హిళ‌పై యాసిడ్ దాడి.. మెడ‌, ముఖం కాలిపోయిన వైనం

చండీగ‌ఢ్‌ : మ‌హిళ‌పై దుండ‌గులు యాసిడ్ దాడికి పాల్ప‌డ్డారు. హ‌ర్యానాలోని పానిప‌ట్‌లో నిన్న సాయంత్రం 6.30 గంట‌ల‌కు ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం వివ‌రాలిలా ఉన్నాయి. మ‌హిళ(37) స్థానిక దుప్ప‌ట్ల ప‌రిశ్ర‌మ‌లో ప‌నిచేస్తుంది. భ‌ర్త‌, ముగ్గురు పిల్ల‌లు ఉన్నారు. కొన్ని రోజుల క్రితం కొంత‌మంది పురుషులు ఆమెను లొంగ‌దీసుకునేందుకు ప్ర‌య‌త్నించ‌గా మ‌హిళ ప్ర‌తిఘ‌టించింది. దీంతో మ‌హిళ రాక‌పోక‌ల‌పై నిఘా వేసిన ఇద్ద‌రు వ్య‌క్తులు ముసుగులు ధ‌రించి బైక్‌పై కాపు కాశారు. మ‌హిళ ప‌ని ముగించుకుని ఇంటికి వెళ్తున్న క్ర‌మంలో ఒక్క‌సారిగా ఆమెపై యాసిడ్ దాడికి పాల్పడ్డారు. ఈ ఘ‌ట‌నంతా స‌మీపంలోని ఓ ఇంటి వ‌ద్ద ఉన్న సీసీ టీవీ కెమెరాలో రికార్డు అయింది. మ‌హిళ భ‌ర్త ఫిర్యాదు మేర‌కు పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు ప్రారంభించారు. బాధితురాలిని చికిత్స నిమిత్తం రోహ‌త‌క్‌లోని పీజీఐఎంఎస్ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. యాసిడ్ దాడిలో మ‌హిళ మెడ‌, ముఖం కాలిపోయాయి.