శుక్రవారం 22 జనవరి 2021
Crime - Nov 27, 2020 , 22:35:13

మహిళ హత్య కేసులో ఇద్దరికి జీవిత ఖైదు

మహిళ హత్య కేసులో ఇద్దరికి జీవిత ఖైదు

వరంగల్‌ క్రైం:  యాసిడ్‌ దాడికి పాల్పడి మహిళను హత్య చేసిన ఘటనలో ఇద్దరు నిందితులకు జీవితఖైదు  విధిస్తూ వరంగల్‌ జిల్లా మూడో అదనపు జిల్లా సెషన్స్‌ జడ్జి కే శైలజ శుక్రవారం తీర్పు వెల్లడించారు. ఈ మేరకు వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ ప్రమోద్‌కుమార్‌ వివరాలు వెల్లడించారు. 2017 సంవత్సరంలో వరంగల్‌ రంగంపేటలో భర్తతో విడిపోయిన గోండా మాధురి జీవనోపాధి కోసం  నగరంలోని ఓ పెట్రోల్‌ పంపులో పనిచేసేది. ఈ క్రమంలో శాకరాజుకుంట ప్రాంతానికి చెందిన ఆటోడ్రైవర్‌ కల్వల చంద్రశేఖర్‌ ఆమెకు పరిచయమై పెళ్లి చేసుకుంటానని వెంటపడడంతో తనకు ఒక పాప ఉందని తెలిపింది. ఇద్దరినీ తాను పోషిస్తానని తెలుపడంతో చంద్రశేఖర్‌ను వేములవాడ రాజన్న సన్నిధిలో మాధురి వివాహం చేసుకున్నది.

ఆ తర్వాత చంద్రశేఖర్‌తో గొడవపడి ఇంటి నుంచి వెళ్లిపోయింది. దీంతో మాధురిపై కక్ష పెంచుకున్న చంద్రశేఖర్‌, పొన్నం రాకేశ్‌తో కలిసి ఆమెను చంపేందుకు ప్రణాళికను రూపొందించుకున్నారు. ఇందులో భాగంగా 2017 నవంబర్‌ 29 తేదీన సాయంత్రం 5గంటలకు  వరంగల్‌ డెయిరీ ఫాం దగ్గర ఉన్న మాధురితో మాట్లాడే పని ఉందని చంద్రశేఖర్‌ ఆటోలో ఎక్కించుకుని జఫర్‌గడ్‌ మండలం గరిమిళ్లపల్లి గ్రామ శివారు ప్రాంతానికి( ప్రస్తుతం ఐనవోలు మండలం)లో తీసుకెళ్లారు. అక్కడ ఆమెపై యాసిడ్‌ పోయడంతోపాటు తమ వెంట తెచ్చుకున్న కత్తులతో పొడిచి అక్కడి నుండి పారిపోయారు. రక్తం మడుగులో పడి ఉన్న మాధురిని గ్రామస్తులు 108 ద్వారా ఎంజీఎం దవాఖానకు తరలించారు.

చికిత్స పొందుతూ 30తేదీన ఆమె మృతి చెందగా, అప్పటి జఫర్‌గఢ్‌ ఎస్సై రాజన్‌బాబు కేసు నమోదు చేసుకోగా, విచారణ అధికారిగా ఏసీపీ మధుసూదన్‌ నిందితులను అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఈ కేసుకు సంబంధించి అధికారులు సీసీ కెమెరాల దృశ్యాలు, సైంటిఫిక్‌, పోస్టుమార్టమ్‌, డీఎన్‌ఏ ఇతర వైద్య పరీక్షలతో కూడిన సాక్ష్యాలను కోర్టుకు అందజేయడంతోపాటు 33 మంది సాక్షులను విచారించారు. అదేవిధంగా వెస్ట్‌జోన్‌ డీసీపీ శ్రీనివాస్‌రెడ్డి పర్యవేక్షణలో ప్రస్తుత ఏసీపీ రమేశ్‌కుమార్‌, వర్ధన్నపేట సీఐ విశ్వేశ్వర్‌, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ బాలకిషన్‌ రావు, జఫర్‌గడ్‌ ఎస్సై కిశోర్‌ ఆధ్వర్యంలో  సాక్షులను ఎప్పటికప్పుడు కోర్టులో హాజరుపర్చారు. దీంతో ఇద్దరు నిందితులు చంద్రశేఖర్‌, పొన్నం రాకేశ్‌కు జీవిత ఖైదు   పడింది. 


logo