సోమవారం 18 జనవరి 2021
Crime - Nov 12, 2020 , 15:06:53

జైలులోకి డ్ర‌గ్స్ నింపిన బంతి విసిరేందుకు య‌త్నం.. ముగ్గురి అరెస్టు

జైలులోకి డ్ర‌గ్స్ నింపిన బంతి విసిరేందుకు య‌త్నం.. ముగ్గురి అరెస్టు

పూణే : గ‌ంజాయి నింపిన టెన్నిస్ బంతుల‌ను జైలులోకి విసిరేందుకు ప్ర‌య‌త్నించిన ముగ్గురు వ్య‌క్తుల‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘ‌ట‌న మ‌హారాష్ర్ట‌లోని కొల్హాపూర్‌ క‌లంబా జైలు వ‌ద్ద చోటుచేసుకుంది. బుధవారం పోలీసు సిబ్బంది పెట్రోలింగ్ చేస్తుండ‌గా ముగ్గురు వ్య‌క్తులు చేతిలో టెన్నిస్ బంతుల‌తో జైలు గోడ చుట్టూ తిరుగుతున్న‌ట్లుగా గుర్తించారు. సున్నిత‌మైన‌, నిషేధిత ప్రాంతంలో తిరుగుతుండ‌టంపై అనుమానం వ‌చ్చిన పోలీసులు వీరిని విచారించ‌గా పూణేకు చెందిన‌వారుగా తెలిపారు. చేతిలోని టెన్నిస్ బంతుల‌ను ప‌రిశీలించ‌గా వాటిపై టేప్ చుట్టి ఉండ‌టంతో క‌ట్ చేసి తెరిచిచూడ‌గా లోప‌ల గంజాయి ఉన్న‌ట్లుగా గుర్తించారు. జైలు లోప‌ల ఉన్న త‌మ స‌న్నిహితుడికి ఈ గంజాయిని చేర‌వేసేందుకు స‌దరు వ్య‌క్తులు ప్ర‌య‌త్నించారు. ముగ్గురిని ఎన్‌డీపీఎస్ యాక్ట్ కింద అరెస్టు చేసిన‌ట్లు పోలీసులు వెల్ల‌డించారు. ఇప్ప‌టికే జైలు లోప‌లికి ఏమైనా స‌ర‌ఫ‌రా చేశారా అని చెక్ చేయాల్సిందిగా జైలు సిబ్బందికి సూచించారు. త‌నిఖీల్లో జైలు సిబ్బంది ఓ మొబైల్ ఫోన్‌ను క‌నుగొన్నారు. కాగా ఇది ఏ వ్య‌క్తికి సంబంధించిందో తేల్చే పనిలో ప‌డ్డారు.